బ్యాంక్‌పై గెలిచిన టీ వ్యాపారి
భోపాల్: చదివింది 5వ తరగతి. వృత్తి టీ అమ్మకం. కష్టపడి బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ము మాయమైంది. బ్యాంక్ అధికారులతో అడిగితే చీవాట్లు పెట్టారు. హెడ్ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కంజూమర్ ఫోరమ్‌ను అయితే ఆశ్రయించాడు కానీ, లాయర్‌ను పెట్టుకునే స్థోమత లేదు. ఇలా అన్నీ కష్టాలే. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తన కేసును తానే వాదించుకున్నాడు. కోర్టులో బ్యాంక్ అధికారులతో నీళ్లు నమలించాడు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌పై కేసు గెలిచాడు. అసలుతో పాటు వడ్డీ, కోర్టు ఖర్చులు, మానసిక ఒత్తిడి అనుభవించినందుకు అదనపు సొమ్ము రాబట్టాడు. చివరకు సామాన్యుడు కోర్టులో విజేతగా నిలిచాడు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన భోపాల్ వాసి రాజేష్ సాక్రే విజయగాథ ఇది.
సాక్రే భోపాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో 20,000 రూపాయల నగదు దాచుకున్నాడు. ఇందులోంచి 10,800 రూపాయలు డ్రా చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన ఖాతాలో ఉండాల్సిన మరో 9200 రూపాయలు మాయమయినట్టు గుర్తించాడు. ఈ సంఘటన 2011లో జరిగింది. సాక్రే ఈ విషయంపై బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేస్తే అతణ్నే మందలించారు. ముంబైలోని ఎస్బీఐ హెడ్‌క్వార్టర్స్‌కు ఫిర్యాదు చేసినా సమాధానం రాలేదు. దీంతో జిల్లా కంజూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. ఆర్థిక స్థోమతలేని కారణంగా తన కేసును తానే వాదించుకున్నాడు. సాక్రే డబ్బు డ్రా చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ సహా ఎలాంటి సాక్ష్యాలు చూపలేకపోయారు. పలుసార్లు విచారణ జరిగిన అనంతరం సాక్రే కేసును గెలిచాడు. ఈ నెల 16న కంజూమర్ కోర్టు సాక్రేకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సాక్రేకు రావాల్సిన 9200 రూపాయల నగదుతో పాటు దానికి వడ్డీ, కోర్టు ఖర్చుల కింద 2000 రూపాయలు, మానసిక ఒత్తిడి కలిగించినందుకు మరో 10 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా కోర్టు బ్యాంక్ అధికారులను ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలలలోపు అతని ఖాతాలో జమచేయాల్సిందిగా సూచించింది. సామాన్యులకు రాజేష్ సాక్రే విజయగాథ స్ఫూర్తిగా నిలిచింది.