‘బంగారుతల్లి’కి అవమానం
ధర్పల్లి, న్యూస్‌లైన్ : ‘బంగారుతల్లి’ పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళ్లిన దంపతులకు అవమానం ఎదురైంది. ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్‌కు చెందిన సుంచ జమున, నరేశ్ దంపతులకు స్నేహిత అనే ఆడబిడ్డ జన్మించింది. ఆరు నెలల క్రితమే వీరికి బం గారుతల్లి పథకం మంజూరుకాగా, బ్యాంక్ ఖాతా తెరవడానికి అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో ఖాతాను తెరిచేందుకు సుంచ జమున దంపతులు ఆరు నెలలుగా తిరుగుతున్నారు. ఖాతాకు అవసరమైన పత్రాలు జత చేసి బ్యాంకు అధికారులకు అందజేసినా ఖాతా ఇచ్చేందుకు తిప్పలు పెడుతున్నారు. బుధవారం మరోసారి బ్యాంక్ ఖాతా కోసం దంపతులు బ్యాంకుకు వచ్చారు. ఖాతాకు సంబంధించిన పత్రాలు జతచేసి బ్యాంక్ అకౌంటెంట్ రాజేశ్వర్ కౌంటర్ వద్దకు వెళ్లారు.
అకౌంటెంట్ ఖాతా తెరిచే పత్రాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ నివాస ధ్రువ పత్రమేనా అంటూ ఖాతాకు సంబంధించిన పత్రాలను వారి ఎదుటే బ్యాంక్‌లోనే ఆయన చింపివేశారు. దీంతో దంపతులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. ఇదేందని బ్యాంక్‌లోనే నిరసన వ్యక్తం చేశారు. బంగారుతల్లినే అవమానిస్తారా అని చిన్నారి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు మేనేజర్ వచ్చి దంపతులను సముదాయించి మరో ఖాతా పత్రాన్ని ఇచ్చి ఖాతా కోసం దరఖాస్తు చేయించారు.