మాజీ చీఫ్ జస్టిస్ వివాదాస్పద వ్యాఖ్యలు
గోమాంసం వివాదంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు చల్లారక ముందే ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజిందర్ సచార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధురలో 'వరల్డ్ సెక్యురిటీ అండ్ రాడికల్ ఇస్లాం' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సచార్ మాట్లాడుతూ.. ఇండియాలో గోమాంసం వ్యాపారం చేసే వారిలో ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే ఉన్నారు, బీఫ్ వ్యాపారం చేసే వారిలో 95 శాతం మంది హిందువులే అని వ్యాఖ్యానించారు. ఆహారపు అలవాట్లకు, మతానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ మాటకొస్తే నేను కూడా బీఫ్ తింటాను అని అన్నారు.
ఇండియాతో పాటు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన పరిశోధక విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సచార్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. కొందరు విద్యార్థులు సచార్ ఉపన్యాసాన్ని ఆపాల్సిందిగా కోరాగా మరికొందరు హాల్ లోని లైట్లు, ఫ్యాన్లను ఆపేసి తమ నిరసన తెలిపారు. ముస్లిం రాడికల్ విధానాలపై జరుగుతున్న సదస్సును యాంటీ హిందూ సదస్సుగా మార్చాడంటూ సచార్పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.