గతవారం బిజినెస్
నియామకాలు
ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా రాజీవ్ లాల్ నియమితులయ్యారు. లఘు, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) కార్యదర్శిగా ఉన్న ఏకే పుజారి సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎస్కే ఆచార్య నియమితులయ్యారు.
ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ సేల్’
దేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ సేల్’ రెండవ ఎడిషన్‌ను నిర్వహించే తేదీలను ప్రకటించింది. రెండవ బిగ్ బిలియన్ సేల్‌ను అక్టోబర్ 13 నుంచి 17 మధ్యకాలంలో నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం యాప్ ద్వారానే జరగనున్న ఈ సేల్‌లో దాదాపు 70కి పైగా వస్తు కేటగిరిలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తామని పేర్కొంది.
భారీ విస్తరణ దిశగా ఎన్ఎండీసీ
ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ వచ్చే ఎనిమిదేళ్లలో రూ. 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 30 లక్షల టన్నులుగా వార్షిక ముడి ఇనుము ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి 100 మిలియన్ టన్నులకు తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు టాంజీనియాలో గోల్డ్‌మైనింగ్, ఆస్ట్రేలియాలో కొత్త ఇనుము గనులను అభివృద్ధి చేయనున్నట్లు ఎన్ఎండీసీ తెలిపింది.
రెపో రేటును అరశాతం తగ్గించిన ఆర్బీఐ
బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ రేట్లకు బెంచ్‌మార్క్‌గా భావించే రెపో రేటును రిజర్వు బ్యాంకు తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్ అనూహ్యంగా మంగళవారం రెపో రేటును ఏకంగా 0.50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రేటు 7.25 నుంచి 6.75 శాతానికి చేరింది. రివర్స్ రెపో రేటు 5.75 శాతానికి చేరుకుంది.
భారత్ రుణ భారం 483 బిలియన్ డాలర్లు
జూన్ చివరినాటికి భారత్ విదేశీ రుణ భారం 483 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం (మార్చితో ముగిసిన) ముగిసే నాటితో పోల్చితే ఈ రుణ భారం 1.8% పెరిగింది. ఆర్బీఐ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. జీడీపీలో భారత్ విదేశీ రుణం నిష్పత్తి 24%గా ఉంది.
చైనా మార్కెట్లోకి దేశీ ఐటీ సంస్థలు
నియంత్రణల చట్రంలో ఉండే చైనా మార్కెట్లో అవకాశాలను దక్కించుకునేందుకు దేశీ టాప్ ఐటీ కంపెనీలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. గ్విజౌ ప్రావిన్స్‌లోని పలు ప్రాజెక్టులను చేజిక్కించుకునేందుకు అయిదు దిగ్గజాలు తొలిసారిగా కన్సార్షియంగా ఏర్పడ్డాయి. షాంఘైలోని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) చొరవతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎన్ఐఐటీ కలిసి కన్సార్షియంగా ఏర్పడ్డాయి.
ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రారంభం
దేశీయంగా 91వ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా ఐడీఎఫ్సీ బ్యాంకు గురువారం కార్యకలాపాలు ప్రారంభించింది. గ్రామీణ మధ్యప్రదేశ్‌లోని 15బ్రాంచీలు సహా 23శాఖలతో బ్యాంకు సేవలు మొదలయ్యాయి. కార్పొరేట్, హోల్‌సేల్ బ్యాంకింగ్‌తో పాటు గ్రామీణ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది.
స్పెక్ట్రమ్ షేరింగ్‌కు మార్గదర్శకాలు
టెలికం స్పెక్ట్రమ్‌ను కంపెనీలు పరస్పరం పంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకు టెలికం విభాగం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కంపెనీ తనకున్న స్పెక్ట్రమ్ హక్కులను మరో కంపెనీకి విక్రయించవచ్చు. ఒకే ఫ్రీక్వెన్సీలో ఒకే టెలికం సర్కిల్లో కార్యకలాపాలు సాగిస్తున్న రెండు టెలికం ఆపరేటర్లు స్పెక్ట్రమ్‌ను షేర్ చేసుకోవచ్చు.
2017 నాటికి పోస్టల్ బ్యాంక్!
2017 నాటికి పోస్టల్ బ్యాంక్ ఏర్పాటు కానుంది. పోస్టల్ బ్యాంక్ ఏర్పాటుకు నీతి ఆయోగ్ ఆమోదం అక్టోబర్ నెల రెండో వారంలోనూ, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అంగీకారం అదే నెల చివరికి, కేబినెట్ ఆమోదం నవంబర్‌లో రావచ్చని కమ్యూనికేషన్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. తర్వాత డిసెంబర్ నెలలో పోస్టల్ బ్యాంక్ నమోదు ప్రక్రియ, అటు పైన 2017 జనవరిలో పేమెంట్ సర్వీసుల ప్రారంభం ఉంటుందని పేర్కొన్నారు.
సెబీలో ఎఫ్ఎంసీ విలీనం
రెండు మార్కెట్ నియంత్రణ సంస్థల విలీనం జరిగింది. దాదాపు 1953లో ఏర్పాటైన కమోడిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎఫ్ఎంసీ (ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్) సోమవారం నాడు 1988లో ప్రారంభమైన క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలో విలీనం అయ్యింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఈ విలీనాన్ని లాంఛనపూర్వకంగా పూర్తి చేశారు. రెండు నియంత్రణ సంస్థలు విలీనం కావడం ఇదే మొదటిసారి.
ఐపీవోకు రానున్న పలు కంపెనీలు
నిధుల సమీకరణే లక్ష్యంగా ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ తదితర కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీవోలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో రూ.1 ముఖ విలువ గల 1.75 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. అలాగే నారాయణ హృదయాలయ సంస్థ, క్విక్ హీల్ టెక్నాలజీస్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, సంధార్ టెక్నాలజీస్, మైణి ప్రెసిషన్ ప్రొడక్ట్స్ ఐపీవోకు రానున్నాయి.
నెమ్మదించిన మౌలిక రంగం
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 38% వాటా ఉన్న ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి ఆగస్టులో నెమ్మదించింది. 2014 ఇదే నెలతో పోల్చితే ఉత్పత్తి వ ృద్ధి కేవలం 2.6% గా నమోదయ్యింది. 2014లో ఈ రేటు 5.9%. ప్రత్యేకించి స్టీల్ రంగం ఉత్పత్తిలో అసలు వ ృద్ధిలేకపోగా -5.9% క్షీణత నమోదయ్యింది.
డీల్స్..
మహిళల దుస్తుల రిైటైలర్ బ్రాండ్, క్రియేటివ్ లైఫ్స్టైల్స్లో మైనారిటీ వాటాను ఆదిత్య బిర్లా ప్రైవేట్ ఈక్విటీ కొనుగోలు చేసింది.ట్యాక్సీ సేవల కంపెనీ ఓలాలో చైనా సంస్థ డీడీ కువైడీ ఇన్వెస్ట్ చేసింది. అయితే, ఎంత పెట్టుబడి పెట్టినదీ వివరాలు వెల్లడి కాలేదు. ప్రత్యర్థి సంస్థ ఉబెర్‌తో పోటీపడేందుకు ఓలా 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3,320 కోట్లు) సమీకరించడానికి ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.
గోద్రేజ్ ప్రొపర్టీస్ సంస్థ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) లోని 4.35 లక్షల చదరపుటడుగుల కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఫార్మా దిగ్గజం అబాట్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.1,480 కోట్లు.
అతి తక్కువ రేటుకే ద్విచక్ర వాహనాల రుణాలు ఇచ్చే విధంగా హోండా మోటార్స్, ఆంధ్రాబ్యాంక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 11.75 శాతం వడ్డీరేటుకే హోండా మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు రుణాలు లభిస్తాయి. అదే మహిళల పేరు మీద కొనుగోలు చేస్తే 0.75 శాతం తక్కువగా 11 శాతానికే రుణాలు ఇవ్వనున్నట్లు హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.
భారత మొబైల్ చెల్లింపుల, కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎంలో చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, యాంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌లు పెట్టుబడులు పెట్టాయి.
టెలికం రంగంలో అంబానీ బ్రదర్స్ కంపెనీలు చేతులు కలుపుతున్నారు. పెద్దన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థతో తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయ న్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్‌కు ఒప్పందం కుదుర్చుకోనుంది.
వివిమెడ్ ల్యాబ్స్ ప్రత్యేక కెమికల్ యూనిట్‌ను క్లారియంట్ కెమికల్స్ ఇండియాకు విక్రయించింది. మొత్తం రూ. 380 కోట్లకు ఈ యూనిట్‌ను విక్రయించింది. విశాఖపట్టణానికి చెందిన అకేసియా లైఫ్ సెన్సైస్ తయారీ యూనిట్‌ను బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ కొనుగోలు చేసింది.