ఆసియా గేమ్స్‌కు మేం ఆతిథ్యమిస్తాం
ఐఓఏ ప్రయత్నాలు
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆసియా గేమ్స్-2019కు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమేనని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి జనరల్ రాజీవ్ మెహతా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వియత్నాం రాజధాని హోనోయ్లో ఈ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. కానీ ఆర్థిక ఒత్తిళ్ల వల్ల హోనోయ్ వైదొలగడంతో భారత్ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘2019 ఆసియా గేమ్స్‌ను నిర్వహించాల్సి వస్తే ఆర్థిక వనరుల కోసం వెతకాల్సిన పనిలేదు. కేవలం గేమ్స్‌ను సమర్థంగా నిర్వహిస్తే సరిపోతుంది. వియత్నాం వైదొలగడంతో మేం ప్రయత్నిస్తున్నాం.
అయితే వచ్చే నెలలో జరగనున్న ఐఓఏ సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఢిల్లీలో సకల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఆమోదం సులువుగానే లభించొచ్చు’ అని మెహతా పేర్కొన్నారు. మరోవైపు ఇండోనేసియా కూడా గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే సెప్టెంబర్ 20న ఇంచ్వాన్ ఆసియా గేమ్స్ సందర్భంగా వేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.