రజియాను చంపింది ప్రియుడే
ప్రకాశం ,కనిగిరి: మర్రిపూడి మండలంలోని కొండ గుహల్లో రజియా(35)ను ఆమె ప్రియుడే కిరాతకంగా చంపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మాయ మాటలు చెప్పి..నమ్మకంగా కొండ గుహల్లోకి తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి కత్తితో గొంతుపై పొడిచి చంపినట్లు సమాచారం. హత్య జరిగిన తర్వాత రోజు మళ్లీ వెళ్లి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టి అనవాళ్లు లేకుండా చేసినట్లు తెలుస్తోంది. రజియా ప్రియుడు ఖాదర్‌బాషా ప్రధాన నిందితుడుకాగా అతడికి సాయంగా తన సమీప బంధువు మరొకరు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పట్టణంలోని కూచిపుడిపల్లికి చెందిన యానిమేటర్ రజియాను ప్రియుడు ఖాదర్‌బాషా శనివారం ఆమె కార్యాలయం నుంచి నమ్మకంగా బైక్‌పై ఎక్కించుకెళ్లాడు.
ఎప్పుడూ సరదాగా వెళ్లి గడిపే కూచిపుడిపల్లిలోని కొండ గుహల్లోకి తీసుకెళ్లాడు. ఆమెను మాటల్లో పెట్టాడు..మైకంలోకి దించాడు. ఒక్క సారిగా రాక్షసత్వం ప్రదర్శించాడు. చున్నీతో గొంతు నులిమి ఆపై కత్తితో గొంతులో కసితీరా పొడిచి చంపినట్లు తెలిసింది. తిరిగి ఇంటికి వచ్చిన ఖాదర్‌బాషా ఏమీ తెలియనట్లు కనిగిరిలో తిరిగాడు. ఆదివారం ఇంట్లోని సొంత భార్య, పిల్లలను బయటకు పంపించి ఇంటికి తాళం వేశాడు. ఖాదర్‌బాషా స్నేహితుడు, దగ్గరి బంధువైన పట్టణంలోని అంకాళమ్మ గుడి వీధికి చెందిన మరొకరిని మద్యం తాగేందుకంటూ ఆదివారం బయటకు తీసుకెళ్లాడు. గార్లపేటలో ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. ఆ తర్వాత ఖాదర్‌బాషా, అతని బంధువు పెట్రోలు తీసుకుని శవం ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనవాళ్లు లేకుండా చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజులకు ఖాదర్‌బాషానే స్వయంగా వెల్లడించిన మాటల మేరకే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సంఘటన స్థలాన్ని గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు మర్రిపుడి పోలీసులు, కనిగిరి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
రజియాగా నిర్థారణ
తొలుత కాలిన శవం రజియాదా కాదా అనే అనుమానంలో ఉన్న పోలీసులు శుక్రవారం ఆ శవం కనిగిరికి చెందిన యానిమేటర్ రజియాదిగానే నిర్థారణకు వచ్చారు. కందుకూరు డీఎస్పీ రవిచంద్ర పర్యవేక్షణలో పూర్తి విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు ఖాదర్‌బాషాతో పాటు అతడి సమీపం బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు కాలిబూడిదైన శవం రజియాదని తేల్చారు.
రజియా మృతదేహానికి పోస్టుమార్టం
మర్రిపూడి: మండలంలోని ఆండ్ర రామలింగేశ్వర స్వామి కొండ గుహల్లో హత్యకు గురైన రజియా (35) మృతదేహానికి శుక్రవారం పంచనామాతో పాటు పోస్టుమార్టం చేసినట్లు ఎస్ఐ సుబ్బారాజు శుక్రవారం తెలిపారు. కందుకూరు డీఎస్పీ రవిచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు గురైన చోటే రజియా మృతదేహానికి రిమ్స్ వైద్యుడు సుబ్బారావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశారు. రజియాను ఆండ్ర రామలింగేశ్వరస్వామి కొండ గుహల్లో పెట్రోల్ పోసి అతి కిరాతకంగా కాల్చి చంపిన ప్రియుడు ఖాదర్‌బాషాను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఆయన వెంట కనిగిరి సీఐ ప్రతాప్‌కుమార్ ఉన్నారు.