జీజీహెచ్ లో పాములు.. హడలెత్తుతున్న రోగులు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో గురువారం మళ్లీ పాము ప్రత్యక్షం అవడంతో వైద్య సిబ్బంది, రోగులు హడలెత్తిపోయారు. ఆర్థోపెడిక్ వైద్యవిభాగంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సు అన్నపూర్ణ బాత్రూమ్కు వెళ్లేందుకు తలుపు తెరవగా లోపల పాము కనిపించింది. దీంతో కంగారుపడిన ఆమె శానిటేషన్ సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు తక్షణమే వచ్చి బాత్రూము గదిలో ఉన్న పామును చంపి బయటపడేశారు. గుంటూరు జీజీహెచ్‌లో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉన్నాయి.
ఆగస్టులో ఇదే వార్డులోని ఆపరేషన్ థియేటర్లో పాము కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన కూడా ఆగస్టులోనే జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్న ఎస్-1 వార్డులోనే మంగళవారం(డిసెంబరు 29వ తేదీ) కట్లపాము ప్రత్యక్షం అయింది. అయితే ఆసుపత్రి సిబ్బంది సమాచారాన్ని సూపరింటెండెంట్‌కు తెలియజేసి గోప్యంగా ఉంచారు. వరుసగా ఇన్ని సంఘటనలు జరిగినా ప్రభుత్వం చర్యలు నామమాత్రంగా ఉండడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.
చెత్తా చెదారం వల్లే పాములు
ఆర్థోపెడిక్ వార్డుల్లో పాము కనిపించిన విషయం తెలియడంతో వార్డుకు వెళ్లి నివారణ చర్యల కోసం సిబ్బందికి ఆదేశాలు జారీచేశామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు తెలిపారు. పక్కనే ఉన్న ఏసీ కళాశాలకు ఆసుపత్రికి మధ్య అనుసంధానం చేస్తూ గోడలు ఉన్నాయని, కళాశాలలో పేరుకుపోయిన చెత్తచెదారం వల్ల ఆర్థోపెడిక్ వార్డులోకి పాములు వచ్చే అవకాశం ఉన్న విషయాన్ని గుర్తించామన్నారు.