రెండేళ్లలో 1,990 ఆత్మహత్యలు
♦ రైతు మరణాలపై సీఎస్
♦ చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ
♦ రాజ్యసభ కమిటీకి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో 2015లో 1,358 మంది, 2016లో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. వాణిజ్య పంటలు వేసిన రైతులు కూడా అధిక పెట్టుబడులు పెట్టి, రాబడి లేక ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆ రైతు కుటుంబాలకు పరిహారమివ్వడంతో పాటు పలు విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాజ్యసభ హమీల అమలు కమిటీకి వివరించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, నివారణ చర్యలు, మైనారిటీల అభివృద్ది, యువత ఉపాధికి చర్యలు, విద్యుత్ రంగంలో మార్పులు తదితరాల పరిశీలనకు చైర్మన్ సతీశ్ చంద్ర మిశ్రా, హుసేన్ దల్వాయి, మహ్మద్ నదీమ్ ఉల్ హక్, లాల్సింగ్ వడోదిన్, మధుసూదన్ మిస్త్రీ, విప్లవ్ ఠాకూర్లతో కూడిన కమిటీ గురువారం రాష్ట్రానికి వచ్చింది.
సీఎస్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్ జలీల్, పోలీసు ఉన్నతాధికారులు వారితో భేటీ అయ్యారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎకరాకు రెండు పంటలకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి తోడ్పాటు అందించేందుకు కార్యచరణ సిద్ధం చేసిందని కమిటీకి సీఎస్ తెలిపారు. కేంద్రం సబ్సిడీ కింద ఇస్తున్న సౌర విద్యుత్ మోటార్లు, మీటర్లపై రైతులు ఆశించినంతగా ఆసక్తి చూపలేదని అజయ్ మిశ్రా తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణలో 24 గంటలు నిరంత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మైనారిటీల అభివృద్ధి కార్యక్రమాలను జలీల్ వివరించారు.