మళ్లీ పార్లమెంట్‌కు అమర్ సింగ్
న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన పాత్ర మిత్రుడు అమర్ సింగ్‌కు ఎంపీగా మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడుగా అమర్ సింగ్ మరోసారి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. అమర్ సింగ్‌తో పాటు బేణీ ప్రసాద్ వర్మ పేర్లును రాజ్యసభ సభ్యులుగా బెర్త్ లు ఖరారు అయ్యాయి. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎస్పీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం లక్నోలో సమావేశమైంది.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా అమర్ సింగ్‌తో పాటు బేణీ ప్రసాద్, సంజయ్ సేథ్, శుక్రాం యాదవ్, విశ్వంభర్ ప్రసాద్ నిశీద్, అరవింద్ సింగ్, రేవతి రామన్ సింగ్ పేర్లను ప్రకటించింది. జూన్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 11 మందిని ఎన్నుకోవాలి. అసెంబ్లీలో బలాన్ని బట్టి సులభంగా ఆరు సీట్లు సమాజ్ వాదీకి దక్కనున్నాయి. కాగా సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ తిరిగి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే.
దాదాపుగా ఆరేళ్ల తరువాత ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన అమర్ కొన్నాళ్లకు 'రాష్ట్రీయ లోక్ మంచ్' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ఆయనకు అంతగా కలసి రాకపోవడంతో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) లో చేరారు. అక్కడా కలిసిరాక చివరకు ఎస్పీలో చేరారు.