రక్షక్ వాహనాలకు ఇంధన సమస్య
మేడ్చల్: తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు అందజేసిన అధునాతన రక్షక్ వాహనాలు ఇంధన సమస్యను ఎదుర్కొంటున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్‌కు ప్రభుత్వం నూతనంగా సరఫరా చేసిన ఇన్నోవా వాహనంలో డీజిల్ కావాలన్నా, బైక్‌లలో పెట్రోల్ కావాలన్నా నగరంలోని లక్డీకాపూల్ ఉన్న డీజీపీ ఆఫీసుకు వెళ్లాల్సిందే. అక్కడ వారు సూచించిన పెట్రోల్ బంకులో ఇంధనం పోయించుకొనిరావాల్సిందే. సైబ రాబాద్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ ల వాహనాలు నగరానికి వెళ్లి ఇం ధనం నింపుకోవాలంటే ఇన్నోవాకైతే రానుపోను 10 లీటర్ల డీజీల్, బైక్లకై తే లీటరున్నర పెట్రోల్ కావాల్సి ఉంటుంది.
వాహనాల్లో నింపుకునే ఇంధనంలో కొంత అనవసరంగా వృథా అవుతోంది. దీంతో పోలీసులు ఈ వాహనాలు నడపడం కంటే తమ సొంత వాహనాలే మేలని అంటున్నారు. మొదట్లో కొత్త వాహనాలపై వెళ్లేందుకు ఆసక్తి కనబర్చినా ఇంధన సమస్య వెంటాడుతుండడంతో వాటిని ముట్టుకోవడానికే జంకుతున్నారు. ఇంధనం వృథా కాకుండా స్థానికంగా ఉండే పెట్రోల్ పంపుల్లో పోయించుకునే వీలు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.