గోదావరి బోర్డు కొత్త చైర్మన్‌గా రామ్‌శరణ్
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు నూతన చైర్మన్‌గా రామ్‌శరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఎగువ గంగా పరీవాహక సంస్థ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో ఆయన సీనియర్ పరిపాలనా గ్రేడ్ అధికారి హోదాలో ఉండగా, హయ్యర్ పరిపాలనా గ్రేడ్ అధికారిగా పదోన్నతి కల్పించి గోదావరి బోర్డు చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. బోర్డు తొలి చైర్మన్‌గా ఉన్న ఎం.ఎస్.అగర్వాల్ ఇటీవల పదవీ విరమణ చేసిన నేపథ్యంలో.. కొత్త నియామకం జరిగింది. ఈనెల 5న ఆయన గోదావరి బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
సీడబ్ల్యూసీకి బోర్డు భేటీ నివేదిక
గోదావరి బోర్డు రెండో సమావేశం వివరాలతో కూడిన నివేదికను పాత చైర్మన్ ఎం.ఎస్.అగర్వాల్ సీడబ్ల్యూసీకి సమర్పించారు. సీలేరు విద్యుత్ వివాదంపై కేంద్ర విద్యుత్ అథారిటీ(సీఈఏ) ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని, కేంద్రం నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నివేదించారు. బూర్గంపహాడ్ అంశాన్ని తెలంగాణ లేవనెత్తినా.. ఏపీ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిందని నివేదికలో పేర్కొన్నారు.