యాలకులు, అల్లంతో హైబీపీ నియంత్రణ!!
మీకు హైబీపీ ఉందా? ప్రతిరోజూ మందులు మింగలేక బాధపడుతున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. అచ్చంగా మన భారతీయ వంటగదుల్లో ఉపయోగించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో చేసిన మిశ్రమం మీ హైబీపీని తగ్గిస్తుంది. కూరలు, రసం, సాంబారు, పచ్చళ్లలో ఉపయోగించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలకు బీపీని నియంత్రణలో పెట్టే గుణం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా.. యాలకులు, అల్లం, జీలకర్ర, మిరియాలు, సోయికూర, అతిమధురం, తెల్లకలువ రేకు.. వీటిని తగుపాళ్లలో కలిపి వాడితే బీపీ బాగా అదుపులోకి వస్తుందని చెన్నైలో జరిగిన పరిశోధనలో తేలింది.
అయితే.. ముందుగా ఈ ప్రయోగాలను జంతువుల మీద చేశారు. అక్కడ సత్ఫలితాలు వచ్చాయి. వీటన్నింటితో రూపొందించిన 'వెంతమారి చూర్ణం' ఎలుకల్లో రక్తపోటును బాగా తగ్గించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో మరింత పెద్ద జంతువులపై ఇదే తరహా ఔషధ ప్రయోగాలు చేయాలని చెన్నై శ్రీరామచంద్రా యూనివర్సిటీ వైద్యులు భావిస్తున్నారు. భారతీయులలో ప్రధానంగా పొగతాగడం, మధుమేహం, హైబీపీ, ఊబకాయం.. ఈ నాలుగు రకాల సమస్యలే చాలావరకు వ్యాధులకు కారణంగా కనిపిస్తున్నాయని, వీటిని అరికడితే సగం సమస్య తప్పినట్టేనని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ ఎస్.తనికాలచం తెలిపారు.