రంజాన్ వ్యాపారాలకు ప్రత్యేక అనుమతి
* సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం
* 22న పోలీస్ ఇఫ్తార్
* సీపీ మహేందర్‌రెడ్డి ప్రకటన
బహదూర్‌పురా: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం వ్యాపార సముదాయాలు ఉన్నచోట రోజంతా (24 గంటలు) వ్యాపారాలు కొనసాగేందుకు అనుమతిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో మసీదు కమిటీతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నగర వ్యాప్తంగా లక్ష సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ మండలంలోనూ పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ నిర్వహిస్తూ, 24 గంటల పాటు పెట్రోలింగ్, మహిళల రక్షణ కోసం షీ టీమ్ బృందాలను రంగంలోకి దింపామన్నారు.
రంజాన్‌లో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నగర పోలీసు విభాగంలో ఈ నెల 22న చౌమహల్లా ప్యాలెస్‌లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. మసీదుల వద్ద అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. చెత్త తొలగించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పనిచేసేందుకు సిబ్బందిని నియమించామని, నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
సాయంత్రం నమాజ్ అనంతరం వచ్చే వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడే వేయకుండా మసీదులకు ప్లాస్టిక్ కవర్లను సరఫరా చేస్తున్నట్టు వివరిచారు. నెల రోజులకు సరిపడ ప్లాస్టిక్ కవర్లను ఒక్కసారిగా మసీదులకు అందజేసి, సిబ్బంది ద్వారా వాటిని సేకరిస్తామన్నారు. మసీదుల ఇమామ్‌లు, కమిటీల సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయా విభాగాల అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేంద్ర, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ శ్రీనివాసరావు, దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఆనంద్, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దక్షిణ అడిషనల్ డీసీపీ బాబూరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.