రామగిరిలో అభివృద్ధి ఏదీ?
కనగానపల్లి : రామగిరి మండలంలో అభివృద్ధి జాడలు కనిపించడం లేదని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని తన స్వగ్రామం తోపుదుర్తిలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల మాజీ కన్వీనర్ పోలేపల్లి ఆదిరెడ్డి, పేరూరు వెంకటేష్, సీపీఎం నాయకుడు గాదికుంట చిన్న పెద్దన్న తమ అనుచరులతో కలసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ... ఇదే మండలానికి చెందిన పరిటాల కుటుంబీకులు 23 ఏళ్లుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నా అభివృద్ధిలో మాత్రం మండలం పూర్తిగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారు ఈ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పరిటాల సునీత కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా నాలుగు చెరువులకు నీరు వదిలి, అంతా మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకొంటున్న మంత్రి సునీత, ఇదే మండలంలోని పేరూరు డ్యాంకు నీరందేలా చూడాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మండలంలో మూతపడిన బంగారు గనులను మంత్రి తెరిపించి, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వెనుకబడిన రామగిరి మండలంతో పాటు రాప్తాడు నియోజకవర్గాన్నంతా తాము అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పార్టీ అనుబంధం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, పార్టీ నాయకుడు అమరనాథరెడ్డి, రామగిరి మండల నాయకులు కేశవనారాయణ, మీనగ నాగరాజు, నరసింహారెడ్డి, కుంటిమద్ది ఆనంద్, పేరూరు రాజేష్, చెర్లోపల్లి రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.