Ramagundam NTPC power plant
-
అక్కడ అన్నీ ఉన్నాయ్.. అధికారుల నిర్లక్ష్యంతో సహా!
రామగుండం: సహజ వనరులకు కొదవ లేదు.. శ్రామిక శక్తికి ఏలోటూ లేదు.. స్థలం కొరత అంతకన్నా లేదు.. నిధుల విడుదలలో ఏమాత్రం జాప్యం కావడంలేదు.. ఉన్నదంతా నిలువెల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే.. అందుకే రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తొలి థర్మల్ విద్యుత్ రామగుండంలోనే.. ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం రామగుండంలోనే నిర్మించారు.అంటే రామగుండం పారిశ్రామి ప్రాంతం ప్రాధాన్యత ఎంతఉందో అర్థం చేసుకోవచ్చు. ►ఎన్టీపీసీ, బీ–థర్మల్, రైల్వేస్టేషన్, సింగరేణి బొగ్గు గనులు, ఎరువుల తయారీ కంపెనీ, సిమెంట్ కంపెనీ తదితర పరిశ్రమలు రామగుండం పేరిట స్థాపించారు. ► రాముడు సీతను నడియాడిన నేల కూడా ఇక్కడే ఉంది. ► రాముడు–సీతాదేవి సంచరించిన ఆనవాళ్లు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయని చర్రికారులు చెబుతున్నారు. ►ఇందుకు నిదర్శనంగా భక్తులు ఆయా ప్రాంతాలను దర్శించుకొని పునీతులవుతున్నారు. పర్యాటకంపై దృష్టి సారిస్తే.. పట్టణ సమీపంలోని రామునిగుండాల ఆధ్మాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రామలక్ష్మణుడు, సీతాదేవి ఇక్కడ సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండపై 108 గుండాలు ఉండగా ఇందులో ఒకగుండం 200 అడుగుల లోతు, 50 అడుగుల వెడల్పుతో ఓలోయ ఉంది. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. 108 గుండాల్లో అన్నికాలాల్లోనూ నీరు సమృద్ధిగా లభిస్తూ ఉండడం ఇక్కడి విశేషం. ఇందులో ప్రధానమైనవి పాలగుండం, నేతిగుండం, జీడిగుండం, పసుపుగుండం, తొక్కుడుగుండం, యమగుండం, ధర్మగుండం, మోక్షగుండం ఉన్నాయి. కొండపై లోయ.. సొరంగం.. ►రామునిగుండాల కొండపై లోయ మధ్యలో సొరంగ మార్గం ఉంది. దీనిని యమకోణమని పేర్కొంటారు. ►ఈ సొరంగం గుండా నిత్యం నీరు పారుతూ ఉంటుంది. ► ప్రతీ శ్రావణ, కార్తీకమాసంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీసీతారామ లక్ష్మణులను దర్శించుకుంటారు. ►ఇంతటి ప్రాధాన్యం కలిగిన రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ► కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా రామగుండం ప్రాధాన్యం గుర్తించి దీని పేరిటనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తారని భావించినా జాబితాలో ఆ పేరు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. మూలనపడ్డ ప్రణాళిక.. రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో 2007లో అప్పటి మున్సిపల్ చైర్మన్ రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇస్కాన్ సంస్థను సంప్రదించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌లోని బిర్లా మందిర్ తరహాలో దేవాలయం, కొండకింద నుంచి పైకి రోప్‌వే నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇస్కాన్ ప్రతినిధులు కూడా క్షేత్రసందర్శనకు రాగా అటవీశాఖ అధికారుల అభ్యంతరంతో అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యాయి. భూ వివాదాస్పద అంశాలతో ఇస్కాన్ సంస్థ ముందుకు రాలేదు. అభివృద్ధికి ఆమడదూరం రామునిగుండాలను అభివృద్ధి చేసేందుకు అటవీ భూముల సాకుతో అభివృద్ధికి నోచుకోకపోవడం లేదు. ఆధ్యాత్మిక చరిత్ర క లిగిన ప్రాంతాలను వివక్ష లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అర్హత ఉన్నా పాలకుల ఆధిపత్య ధోరణితో అభివృద్ధికి దూరంగా ఉంది. – భట్టు ప్రసాద్, పట్టణవాసి అవకాశం ఉన్నా.. రామగుండం పేరిట ఉన్న ప్రతీ పరిశ్రమకు సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్)కింద నిధులు విడుదల చేసి అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. కానీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను పాలకులు వేరే ప్రాంతాలకు తరలించుకెళ్లారు. ఏ ప్రాంతమైనా ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అన్ని రంగాలు ప్రగతి సాధిస్తాయి. – ముస్త్యాల శంకర్లింగం, పట్టణవాసి -
ఎస్టీపీపీకి ఏమైంది.. రోజుకు రూ.కోటిన్నర నష్టం
సాక్షి, జైపూర్(కరీంనగర్) : జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విద్యుత్ వెలుగులు విరజిమ్మాల్సిన థర్మల్ ప్రాజెక్టులో కాంతులు కరువయ్యాయి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు గడ్డుకాలం ఎదురవుతోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోవడంతో థర్మల్ పవర్‌కు రోజురోజుకూ డిమాండ్ పడిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ తగ్గడంతో జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి ట్రాన్స్‌కో ఉత్పత్తి నిలిపివేసింది. 20 రోజులుగా యూనిట్–2 (600మెగావాట్ల ప్లాంటు) షట్‌డౌన్‌కే పరిమితమైంది. యూనిట్–1 (600మెగా వాట్లప్లాంటు) కేవలం 80శాతం పీఎల్ఎఫ్ (ప్లాంటు లోడ్ ఫ్యాక్టరీ)తో నడుస్తోంది. ఒక్కరోజులో రెండు యూనిట్ల ద్వారా 27 మిలియన్ యూనిట్ల నుంచి 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన ఎస్టీపీపీ.. ఇప్పుడు కేవలం 11 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంతో రెండు యూనిట్ల ద్వారా ఒక్క రోజుకు కనీసం రూ.కోటిన్నరకుపైగా నష్టం వాటిల్లుతోంది. జైపూర్ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజె క్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫ రా చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంటు కీలకంగా మారింది. సీఎం కేసీఆర్ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో రెండు యూని ట్లు (12మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంటు) ద్వారా మూడేళ్లల్లో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి సాధించారు. సింగరేణి సంస్థ జర్మనీకి చెందిన స్టీగ్‌ఎనర్జీ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వి ద్యుత్ ఉత్పత్తి నిర్వహణ బాధ్యతలు అప్పగించి న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవడం.. హైడల్ ప్రాజెక్టుల ద్వారా పవర్ ఉత్పత్తి కావడం.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో సింగరేణి థర్మల్ పవర్‌కు డిమాండ్ తగ్గిపోతోంది. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అన్ని వనరులు ఉండి.. విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ డిమాండ్ లేనికారణంగా తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కోరోజుకు 140 మిలియన్ యూనిట్ల నుంచి 160 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను ట్రాన్స్‌కో డిమాండ్ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా 45 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా జెన్కో హైడల్(వాటర్ పవర్) ద్వారా 50 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. సెంట్రల్ థర్మల్ ప్లాంటుల ద్వారా 20 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా విండ్, సోలార్ ద్వారా మరో 20 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ద్వారా కేవలం 11 మిలి యన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి మాత్రమే చే స్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను బట్టి తెలంగాణ ట్రాన్స్‌పవర్ గ్రిడ్ ఆయా విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధిస్తోంది. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గల రెండు యూనిట్లు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించడంతో రోజుకు 27 మిలియన్ యూ నిట్ల నుంచి 30మిలియన్ యూనిట్ల వరకు వి ద్యుత్ ఉత్పత్తి పవర్ గ్రిడ్‌కు సరఫరా చేయగా.. 20 రోజుల వ్యవధిలో యూనిట్–2 ప్లాంటు (అక్టోబర్ 23 నుంచి) పూర్తిగా షట్‌డౌన్ చేశారు. యూనిట్–1లో కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరపకుండా కేవలం 80శాతం పీఎల్‌ఎఫ్‌తో నడిపిస్తున్నారు. 27మిలియన్ యూని ట్లు సాధించిన ఎస్టీపీపీ ఇప్పుడు కేవలం 11మి లియన్ యూనిట్లకు విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా నీరు, బొగ్గు, ఆయిల్ కాగా అన్ని వనరులు కలిగి ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్ లేనికారణంగా ఉత్పత్తి నిలిపివేయడంతో రెండు యూనిట్ల ద్వారా ఒక్కరోజుకు రూ.కోటిన్నరకుపైగా నష్టం వాటిల్లుతోంది. ఇలా 20రోజుల వ్యవ«ధిలో రూ.28 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గతేడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఉండ డం.. ఎస్టీపీపీ ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించడం ద్వారా సింగరేణిలో సాధిం చిన లాభాల్లో అత్య«ధికంగా రూ.510 కోట్లు ఎస్టీపీపీ నుంచే వచ్చాయి. ప్రస్తుతం పవర్ డిమాండ్ పడిపోవడం ఈ ఏడాది అంతగా లాభాలు వచ్చేలా కనిపించడం లేదు. -
కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పు
కరీంనగర్: సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల సందర్శనలో స్వల్ప మార్పు జరిగింది. రెండో రోజు ప్రాజెక్టుల సందర్శనకు రామగుండం నుంచి బయలుదేరిన కేసీఆర్ తన పర్యటన షెడ్యూల్లో లేని రామగుండం ఎన్టీపీసీని సందర్శించారు. అక్కడ జరుగుతున్న1600 మెగావాట్ల తెలంగాణ విద్యుత్ కర్మాగారం పనులను పరిశీలించారు. ధర్మారం మండలం నందిమేడారం చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ పంప్‌హౌజ్ పనులు, అండర్ టన్నెల్ పనులను కూడా ఆయన పరిశీలించారు. -
రామగుండం ఎన్టీపీసీ ‘మెగా’ విస్తరణ
-
రామగుండం ఎన్టీపీసీ ‘మెగా’ విస్తరణ
⇒ 4,000 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు లైన్ క్లియర్ ⇒ దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ కేంద్రంగా అభివృద్ధి ⇒ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీపీసీల మధ్య కుదిరిన అవగాహన ⇒ సీఎం కేసీఆర్‌తో సంస్థ సీఎండీ భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం భారీ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలవబోతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా రామగుండంలోని ప్రస్తుత ఎన్టీపీసీ కేంద్రం ఆవరణలోనే నిర్మించాలని సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహనకు వచ్చాయి. ఎన్టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అరుప్‌రాయ్ చౌదరి, దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వెంకటేశ్వరన్ సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ‘రామగుండం ఎన్టీపీసీ’ విస్తరణకు సంబందించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆయన ముందుంచారు. సీఎం సైతం సానుకూలంగా స్పందించారు. పంతం నెగ్గించుకున్న ఎన్టీపీసీ ఎన్టీపీసీకి రామగుండంలో 9,500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2,600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలను సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600(2ఁ800) మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఇప్పటికే ఎన్టీపీసీ చేపట్టింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లకు స్థల కేటాయింపుల విషయంలో ఎన్టీపీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకురాగా, ఎన్టీపీసీ మాత్రం రామగుండంపైనే పూర్తి ఆసక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది. మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్లను రామగుండంలోనే నిర్మించాలనే ప్రతిపాదనను సంస్థ సీఎండీ అరుప్‌రాయ్ తాజాగా సీఎం కేసీఆర్ ముం దుంచారు. నాలుగేళ్లలో ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు నీటితోపాటు కేంద్రం నుంచి బొగ్గు కేటాయింపుల అంశాన్ని స్వయంగా పరిశీలిస్తానని సీఎం కూడా హామీ ఇచ్చారు. దీంతో నాలుగేళ్లలో రామగుండం ఎన్టీపీసీ సామర్థ్యం 6,600 మెగావాట్లకు చేరనుంది. కాగా, రామగుండం మండల పరిధిలో బీపీఎల్ సంస్థకు గతంలో కేటాయించిన నిరుపయోగ భూములను తమకు కేటాయించాలని కేసీఆర్‌ను ఎన్టీపీసీ సీఎండీ కోరారు. అయితే ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్న ఈ భూములపై ఎలాంటి హామీ ఇవ్వలేమని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా యాష్ పాండ్(బూడిద నిల్వ స్థలం) ఏర్పాటు కోసం 400 ఎకరాలు కావాలని ఎన్టీపీసీ కోరగా, ఇప్పడున్న యాష్ పాండ్తోనే ప్రస్తుతానికి పని కానివ్వాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. దామరచర్లలో సోలార్ ప్లాంట్లు నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్కో, ఎన్టీపీసీల ఆధ్వర్యంలో 6,400 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జెన్కో ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ వైదొలగడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. జెన్కో నిర్మించే థర్మల్ కేంద్రాలతోపాటు అక్కడ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.