'నాకు, నా చెల్లికి మధ్య చిచ్చు పెట్టాడు'
నేరేడ్మెట్(హైదరాబాద్): వరుసకు అక్కాచెల్లెళ్లైన ఇద్దరు యువతులు రామకృష్ణాపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. డీసీపీ రాంచంద్రారెడ్డి, నేరేడ్మెట్ సీఐ జగదీష్చందర్ కథనం ప్రకారం... రామకృష్ణాపురం చెరువులో శుక్రవారం ఇద్దరు యువతుల మృతదేహాలు తేలియాడుతుండగా పోలీసులు వెలికి తీయించారు. చెరువు గట్టుపై బండ రాయి కింద సూసైడ్ నోట్లు లభించాయి. వాటి ఆధారంగా మృతుల్లో ఒకరు సౌమ్య రాజేశ్వరి (సుమారు 20), మౌనిక (సుమారు 19)గా గుర్తించారు.
ఆకివీడుకు చెందిన సౌమ్య రాజేశ్వరి తల్లిదండ్రులు చనిపోవడంతో ఘట్కేసర్లోని హాస్టల్లో ఉంటూ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతోంది. మౌనిక కుషాయిగూడలో నివాసముంటోంది. ఈమె నాగార్జున అనే యువకుడ్ని ప్రేమిస్తోంది. అతడితో ప్రేమ విఫలం కాగా... కామేష్ అనే వ్యక్తి మౌనికను వేధిస్తున్నాడు. సౌమ్య గురువారం మౌనిక ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి రాత్రి 7 గంటలకు రామకృష్ణాపురం చెరువు వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా, కామేష్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో మౌనిక పేర్కొంది. తనకు, తన చెల్లెలికి మధ్య కామేష్ చిచ్చుపెట్టాడని అందులో రాసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామేష్ ను కఠినంగా శిక్షించాలని బాధితుల తరపు వారు డిమాండ్ చేస్తున్నారు.