తండ్రిపై కొడుకు కత్తితో దాడి
జుత్తిగ(పెనుమంట్ర) : ఆస్తి తగాదాల నేపథ్యంలో పెద్దకొడుకు తండ్రిపై కక్ష పెంచుకుని బుధవారం కత్తితో దాడిచేసిన ఘటన జుత్తిగలో జరిగింది. జుత్తిగకు చెందిన సత్తి రామకృష్ణారెడ్డి, అతని పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం చోటు చేసుకుంది. శ్రీనివాసరెడ్డి అదే గ్రామంలో వేరే చోట నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం సుమారు 7 గంటలకు తండ్రి ఇంటికి కత్తితో వచ్చి తనకు రావలసిన ఆస్తి ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. శ్రీనివాసరెడ్డి తండ్రిపై కత్తితో దాడిచేసి ఉదరం, భుజాలపై విచక్షణా రహితంగా నరికాడు. కుప్పకూలిపోయిన రామకృష్ణారెడ్డిని స్థానికులు 108 వాహనంలో తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పెనుమంట్ర ఎస్సై కె.వీరబాబు తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణారెడ్డి వాంగ్మూలం మేరకు కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.