రామన్ రాఘవ్ ఏం చేశాడు?
ముంబై: విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, విక్కీ కౌశల్ ప్రధానపాత్రల్లో నటించిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారం విడుదలైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్ పేజీలో ఈ పోస్టర్ ను పెట్టారు. చేతివేళ్లను గుండ్రంగా మడిచి ఎర్రటి కళ్లతో చూస్తున్న నవాజుద్దీన్ వెనుక రక్తంతో తడిసిన ఇనుప రాడ్లు ఉన్నట్టుగా ఫొటోలో చూపించారు. మొత్తం పోస్టర్ నీలం రంగులో ఉంది.
క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ నోటోరియస్ సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడు. మసాన్ ఫేమ్ విక్కీ కౌశల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. 1960 దశకంలో ముంబైని గడగడలాడించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. 1960లో 23 మందిని, 1968లో డజను మందిని హత్య చేసినట్టు పోలీసులకు పట్టుబడినప్పుడు అతడు అంగీకరించాడు. అయితే అతడు చేసిన హత్యలు ఇంకా ఎక్కువే ఉంటాయని పోలీసులు అనుమానించారు.
ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్ పోస్టర్లను అనురాగ్ కశ్యప్ ఆదివారం విడుదల చేశారు. 69వ కేన్స్ అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్ లో 'డాక్టర్స్ ఫోర్ట్ నైట్' విభాగంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. తెరపై రామన్ రాఘవ్ ఏం చేశాడో చూడాలంటే చిత్రం జూన్ 24 వరకు ఆగాల్సిందే.