రామారావ్ మహారాజ్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి
- తన వంతుగా పార్లమెంట్లో మాట్లాడతానన్న ఎంపీ కవిత
నిజామాబాద్: లంబాడా సమాజం అభ్యున్నతికి కృషి చేసిన రామారావ్ మహారాజ్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించేలా తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గురువారం నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం దేవా తండాలో జగదాంబ మాత ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
అనంతరం తెలంగాణ సేవాలాల్ మహారాజ్ పూజారుల కమిటీ అధ్య క్షుడు శివరాం మహారాజ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కవిత మాట్లాడుతూ రామారావుకు భారత రత్నను ప్రకటించే అంశం గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కేంద్రానికి లేఖ రాసేలా చూస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనతో బతుకమ్మలాడిన లంబాడా మహిళలు బాగుండాలని జగదాంబ మాతను కోరుతున్నానన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమని, అలాగే బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్ పండుగలో తాను కూడా పాల్గొంటున్న విషయాన్ని గుర్తుచేశారు.