కాశీ యాత్రలో విషాదం
నరసరావుపేట : గుంటూరు జిల్లా నుంచి కాశీకి బయలుదేరిన యాత్రికుల ప్రైవేటు బస్సు ఒడిశా రాష్ట్రంలోని కటక్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసరావుపేట పట్టణానికి చెందిన రాజవరపు రామతులశమ్మ (63) మృతి చెందగా , మరికొందరికి గాయాలయ్యాయి. యాత్రకు నాయకత్వం వహిస్తున్న జయమ్మ ఈ నెల 2 0వ తేదీ రాత్రి నరసరావుపేట పట్టణంతో పాటు రొంపిచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన 40 మందితో ప్రైవేటు బస్సులో కాశీకి బయలు దేరారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి బస్సులో లోయలో పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన కర్రి సీతారావమ్మ తీవ్రంగా గాయపడింది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
క్షేమంగా తీసుకొస్తున్నాం: ఆర్డీవో
సంఘటన జరిగిన ప్రదేశం నుంచి రామతులశమ్మ భౌతికకాయంతో పాటు గాయపడిన వారందరినీ క్షేమంగా నరసరావుపేటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో ఎం.శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికారులను అప్రమత్తం చేశారన్నారు. కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒడిశా రాష్ట్రంలోని ఖాజాపూర్ కలెక్టర్ సత్యకుమార్ మల్లిక్, రసూల్పూల్ తహశీల్దార్ అరుణ్‌కుమార్ బెహరాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారన్నారు. అక్కడి డీఎస్పీ పర్యవేక్షణలో ఒక పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. మృతురాలి భౌతికకాయాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో నరసరావుపేటకు తీసుకొస్తున్నారని, మిగతా యాత్రికులను కటక్ నుంచి విజయవాడకు దివాకర్ ట్రావెల్స్ బస్సులో బుధవారం తెల్లవారుజామున విజయవాడకు వస్తున్నట్లు చెప్పారు. కాగా అమెరికాలో ఉన్న వైఎస్సార్ సీపీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వర సహాయ చర్యలు తీసుకోవాలని సూచించారు.