భారత పరిక్రమ యాత్రకు ఘన స్వాగతం
రామవరప్పాడు :
భారత పరిక్రమ యాత్ర సోమవారం ప్రసాదంపాడుకు చేరింది. యాత్ర నిర్వహిస్తున్న రాషీ్ట్రయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ట ప్రచారక్ సీతారాంజీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి కామినేని శ్రీనివాస్, సినీనటుడు వెంకటేష్ స్వాగతం పలికారు. సీతారాంజీ మాట్లాడుతూ గ్రామ వికాసం కేవలం భౌతిక అవసరాలను తీర్చటం మాత్రమే సాధ్యం కాదని, గ్రామ వికాసంపై మనస్సులో శ్రద్ధకలగాలని స్వామి వివేకానంద భావించారన్నారు. ఈ సందేశాన్ని భారత ప్రజలకు అందించడం కోసం కన్యాకుమారి నుంచి ఆగస్టు 9, 2012లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యాత్రను ప్రారంభించామన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల మీదుగా ఇప్పటి వరకూ 22,000 కిలో మీటర్లు యాత్రను పూర్తి చేసినట్లు వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలోకి జూలై 13న అరకు నుంచి యాత్ర ప్రారంభమైందని చెప్పారు. యాత్రకు స్వాగతం పలికిన వారిలో ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ ఉన్నారు.