సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఎమ్మెల్యే రాందాస్‌నాయక్
భద్రాద్రి: నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిండమేకాక పాలనలో ఇబ్బందులు రాకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషిచేస్తానని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తెలిపారు. పల్లె, పట్టనం, మారుమూల తండాలనే తేడా లేకుండా సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని.. సమస్యల పరిష్కారం ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని తెలిపారు.
ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనతో ప్రజలు నేరుగా మాట్లాడి సమస్యలు చెప్పుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యాన శుక్రవారం ‘హలో ఎమ్మెల్యే’ పేరిట ఫోన్ ఇన్ ఏర్పాటుచేయగా మంచి స్పందన లభించింది. సుమారు వంద మందికి పైగా ఫోన్ చేయగా ఎమ్మెల్యే 30 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన వచ్చినందునప్రతీ పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని తెలిపారు. గత పదేళ్లలో గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేని, ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈమేరకు ప్రజల్లో కొందరు అడిగిన ప్రశ్నలు, ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న : జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కె ట్ యార్డు ఏర్పాటు చేయాలి. గతంలో స్థలం కేటా యించినా నిర్మాణం చేపట్టలేదు. మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది. – వేల్పుల నర్సింహారావు, జూలూరుపాడు
ఎమ్మెల్యే : రెవెన్యూ అధికారులతో మాట్లాడి యార్డు నిర్మాణమయ్యేలా చూస్తాను. త్వరలో రెండు శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తాం.
ప్రశ్న : చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు ఉన్నా డ్రెయినేజీలు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. – సూర్య, నూకలంపాడు / ఎల్.గోపాల్‌రావు తనికెళ్ల / రామకృష్ణ, కారేపల్లి
ఎమ్మెల్యే : చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు ఉన్నా డ్రెయినేజీలు నిరిమంచలేదు. తప్పకుండా పూర్తి స్థాయిలో డ్రెయినేజీలు నిర్మాణం చేపట్టేలా అవసరమైన నిధులు మంజూరు చేయిస్తా.
ప్రశ్న : పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో బోర్లు వేయిస్తే మా సమస్య పరిష్కారమవుతుంది. – రాంబాబు, మాణిక్యారం / బాలు, వినోభానగర్ / నారపోగు నాగరాజు, కేజీ సిరిపురం
ఎమ్మెల్యే : పోడుభూములకు పట్టాలిచ్చే కార్యక్రమం చేపట్టి ఆ భూముల్లో బోర్లు వేయిస్తాం. ఐటీడీఏ ద్వారా గిరిప్రభ పథకం ద్వారా బోర్లు వేయించే కార్యక్రమం త్వరలోనే చేపడతా.
ప్రశ్న : జూలూరుపాడులో 30 పడకల ఆస్పత్రి ఉన్నా వైద్యం అందడం లేదు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయించి వైద్యసేవలు అందేలా చూడండి. – పి.నాగరాజు, జూలూరుపాడు
ఎమ్మెల్యే : ఆస్పత్రి ఆప్‌గ్రేడ్‌పై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడతాను. అవసరమైతే ఆరోగ్యశాఖ మంత్రికి సమస్యను తీసుకెళ్తా.
ప్రశ్న : మా గ్రామంలో శివాలయానికి తొమ్మిది ఎకరాల భూమి ఉన్నా ఆలయ అభివృద్ధి జరగడం లేదు. – ఏ.రాంబాబు, పాపకొల్లు
ఎమ్మెల్యే : దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆలయ అభివృద్ధితో పాటు నిత్యపూజలు జరిగేలా ఏర్పాట్లు చేయిస్తాం.
ఇవి చదవండి: ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక