రహదారిపై రాకెట్లలా..
విశాఖ టు టీపీ గూడెం టు విశాఖ
సైకిళ్లపై 40 గంటల్లో 600 కిలోమీటర్ల పయనం
పారిస్‌లో 12 ఏళ్లకోసారి జరిగే సైకిలింగ్‌లో అవకాశానికి
రాండోనియాస్ బృందం యత్నం
గండేపల్లి :
వారి కాళ్లు పెడళ్లపై చకచకా కదులుతుంటే..చక్రాలు రెండూ విమానాల ప్రొపెల్లర్లతో పోటీ పడుతున్నాయి. వారి సైకిళ్లు సంధించిన బాణాల్లా దూసుకుపోతున్నాయి. చూస్తుండగానే కిలోమీటర్లకు కిలోమీటర్లు తరిగిపోతున్నాయి. పిక్కబలంతోనే అనేక మోటారు వాహనాలను సైతం వెనక్కి నెడుతూ ముందుకు సాగుతున్న ఆ 10 మంది గమ్యం విశాఖపట్నం. స్పోరŠట్స్ మోడల్ సైకిళ్లపై సాగుతున్న వారి యాత్ర విశాఖ నుంచి మొదలైంది. ‘ఇదేమిటి.. వారి గమ్యం విశాఖ అంటూనే విశాఖ నుంచి బయలులేరినట్టు చెపుతున్నారు’ అనుకోకండి.. నిజంగానే విశాఖలో బయలుదేరిన వారి గమ్యం విశాఖే. పారిస్‌లో జరిగే సైకిలింగ్‌లో పాల్గొనే అవకాశం కోసం 600 కిలోమీటర్ల దూరాన్ని సైకిలింగ్‌తో 40 గంటల్లో పూర్తి చేయాలన్నది వారి లక్ష్యం. గండేపల్లి మండలంలోని తాళ్లూరు వద్ద జాతీయ రహదారిపై తారసపడిన వారిలో కొందరిని ‘సాక్షి’ పలకరించింది. విశాఖ నుంచి గురువారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరి తాడేపల్లిగూడెం టోల్‌గేట్‌కు చేరుకున్నామని, అక్కడి నుంచి తిరిగి విశాఖకు బయలుదేరామని ఆడిక్ ఇండియా రాండోనియాస్ క్లబ్ ఆర్గనైజర్ శ్రీధర్ తెలిపారు. ఈ సైకిలింగ్ ద్వారా పారిస్‌లో 12 సంవత్సరాలకొకసారి జరిగే అరుదైన సైకిలింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని చెప్పారు. విశాఖలో ఏడాదికొకసారి 200, 300, 400, 600 కిలోమీటర్ల దూరాలకు సైకిలింగ్ నిర్వహిస్తామన్నారు. సైకిల్‌ను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని పలువురికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఫిఫ్టీ ఫోర్‌లోనూ తగ్గని జోరు
సైకిలింగ్ బృందంలో 54 సంవత్సరాల వయసున్న ఉన్న రథ్ కూడా ఉన్నారు. ఆ వయసులోనూ ఆయన కుర్‌ారళ్లతో పోటీ పడుతూ వారిని మించిన జోరుతో సైకిల్ తొక్కుతున్నారు. వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కినా తనకు ఎటువంటి అలసట, నీరసం లేవని, చాలా హేపీగా ఉందని ఆయన చెప్పారు.