ఎమ్మెల్యే ఎదుట కన్నీరుమున్నీరైన మహిళలు
కావలి (నెల్లూరు): పోలీసులపై దాడి చేసి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మత్స్యకార గ్రామమైన కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. పోలీసులపై దాడి చేసిన ఘటనలో 60 మందిపై కేసులు నమోదు కావడం, గ్రామంలోని యువకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు గాలిస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు భీతిల్లుతున్నారు. కొందరు ఆకతాయి యువకులు చేసిన తప్పులకు గ్రామంలోని ప్రజలందరూ బాధ్యత వహించాల్సి వస్తోందని, పోలీసులు ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను అకారణంగా ఇబ్బంది పెడతారేమోనని మహిళలు భీతిల్లుతున్నారు. ఇదే విషయాన్ని అదివారం ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకుని కన్నీంటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చిన ఎమ్మెల్యే సమస్యను పోలీసు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు.
చట్టాలను అమలు పరచడానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి పోలీసులు ఆహోరాత్రులు శ్రమిస్తుంటారని, అలాంటి పోలీసులు మన గ్రామాలకు వచ్చినప్పుడు వారిని గౌరవించాలని పేర్కొన్నారు. కొందరు ఆకతాయి యువకులు చేసిన చర్యల వల్ల గ్రామస్తులందరూ బాధ పడుతున్నారన్నారు. ప్రశాంతంగా జీవించే మత్స్యకారులు ఇలాంటి దుర్ఘటనల్లో చిక్కుకోవడం వ్యక్తిగతంగా తనకు కూడా బాధగా ఉందన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి తెలియజేస్తే, పోలీసులకు నచ్చచెప్తానన్నారు. అనంతరం మహిళలతో పాటు గ్రామస్తులను వెంట బెట్టుకుని కావలి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మత్స్యకారులను డీఎస్పీ కె.రఘుతో మాట్లాడించిన ఎమ్మెల్యే అమాయకులను ఇబ్బంది పెట్టవద్దని డీఎస్పీ ని కోరారు.
దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ గ్రామానికి వచ్చిన పోలీసులపై దాడులు చేయడం హేయమైన చర్యని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను గ్రామస్తులే గుర్తించి, పోలీసులకు అప్పగించి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నాయకులు జంపాని రాఘవులు, కొమారి రాజు, పామంజి నాగమణి, ఆవుల దుర్గారావు, ఎల్లంగారి రమణయ్య, బుచ్చింగారి తిరుపతి, కాటంగారి చిట్టిబాబు, వావిల పోతయ్య, ఎల్లంగారి జయరాం, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.