భక్తులకు అన్ని సౌకర్యాలు : జేసీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పుష్కర ఘాట్లలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జేసీ రాంకిషన్ తెలిపారు. శనివారం బీచుపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పుష్కరఘాట్లు భక్తజనసంద్రంగా మారాయన్నారు. అలంపూర్, బీచుపల్లి, సోమశిలలో అంచనాలకు మించి భక్తులు స్నానాలు ఆచరించారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, స్నాన ఘట్టాల్లో ఉన్న నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి పుష్కరఘాట్‌కు ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. గొందిమళ్ల ఘాట్‌లో స్నానమాచరించే వారి సంఖ్య లక్షకు చేరుకుందన్నారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ డీఎస్ఓ రాజారావు, బీచుపల్లి ఘాట్ ప్రత్యేకాధికారి రంగారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి గౌతం ఫక్రూ, డీఎస్పీ బాలకోటి, ఓఎస్డీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.