హక్కులు హరిస్తూనే స్వేచ్ఛా పలుకులా?
దళిత స్త్రీ శక్తి సభలో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్
సాక్షి, హైదరాబాద్: హక్కులు హరించి వేస్తున్నవారే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గురించి మాట్లాడుతున్నారని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సంకెళ్లను తెంచుకుందాం’ అనే నినాదంతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘అంబేడ్కర్ ఎవరికోసం పోరాడారో, ఎవరికోసం పరితపించారో, ఆ దళితుల బిడ్డలే ఈ దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెప్టిక్ ట్యాంకుల్లో శవాలై తేలుతున్నారు. సెప్టిక్ ట్యాంక్లో పడి మరణించిన వారి దుఃఖాన్ని దిగమింగుకొనేందుకు వారి శవాల ముందు నా జాతి బిడ్డలు చిందులేస్తున్నారని’ విల్సన్ గద్గద స్వరంతో అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ నినాదం ప్రజల్ని మభ్య పెట్టే ఒక ఎజెండానే తప్ప మానసిక పరివర్తనతో వచ్చింది కాదన్నారు. దేశంలో కేవలం దళితులపైనే దాడులు జరుగుతున్నాయని, ఆ తరువాత వరుసలో ముస్లింలు ఉన్నారన్నారు. బహుజనులు కూడా దళితులను అణచివేసేవారేననడంలో సందేహం అక్కర్లేదన్నారు. రెయిన్ బో హోం నిర్వాహకురాలు అనురాధ మాట్లాడుతూ మానవ మలమూత్రాలను ఎత్తివేసే పనిని దళితులే చేస్తున్నారని, దీనిని ఉపాధి అనడం ఈ సమాజానికే అవమానకరం అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ , దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ, నర్రా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.