స్వామీజీ ఆశ్రమంలో మృతదేహాలు లభ్యం!
బల్వారా: హర్యానా బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్పాల్ ... సత్యలోక్ ఆశ్రమంలో మృతి చెందిన నాలుగురు మహిళ మృతదేహాలను ఆశ్రమవాసులు తమకు అప్పగించారని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్.ఎన్. వశిష్ట బుధవారం వెల్లడించారు. ఆశ్రమంలో అనారోగ్యంతో ఉన్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా...వారు చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారితోపాటు 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉందన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం అఘోరాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులు ఢిల్లీకి చెందిన సవిత (31), రోహితక్కి చెందిన సంతోష్ (45) బిజినోర్కు చెందిన రాజ్ బాల (70) పంజాబ్లోని సంగురూర్కి చెందిన మలికిత్ కౌర్ (50) గా గుర్తించినట్లు చెప్పారు. రామ్ పాల్ ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదని తెలిపారు.
ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్లోక్ ఆశ్రమ స్వామీజీ రామ్పాల్పై హర్యానా పంజాబ్ ఉమ్మడి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారు. స్వామీజీని అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ ఆయన భక్తులు, అనుచరులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దాంతో పలువురు భక్తులు, అనుచరులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రులకు తరలించారు.