విష్ణుతో, మనోజ్‌తో చేయించనిది అందుకే!
‘‘రెండేళ్ల క్రితం ఓ మరాఠీ సినిమా చూశా. అది కూడా మా కో-డెరైక్టర్ రవి పట్టుబట్టడం వల్ల. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే హక్కులు తీసుకుని ఈ సినిమా చేశాం. ఇందులో అన్ని అంశాలూ ఉన్నాయి’’ అని మోహన్‌బాబు అన్నారు. ‘అల్లరి మొగుడు’లో సందడి చేసిన రమ్యకృష్ణ-మీనా కాంబినేషన్లో, ‘అల్లరి’ నరేశ్-పూర్ణ ఓ జంటగా మోహన్‌బాబు నటించిన చిత్రం ‘మామ మంచు-అల్లుడు కంచు’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు పంచుకున్న కబుర్లు...
విష్ణుతో సినిమా తీయాలనే ఆలోచనతో దర్శకుడు శ్రీనివాసరెడ్డి వచ్చాడు. ఆ కథ లేట్ అయ్యేట్లు ఉండడంతో ఈ మరాఠీ సినిమా చూడమన్నాను. అతనికి బాగా నచ్చింది. 22 సంవత్సరాలకు ముందు రమ్యకృష్ణ, మీనా నాతో నటించారు. ఈ సినిమాలో మళ్ళీ వాళ్లనే పెట్టుకోవడానికి కారణం... ఇందులోనూ నా పాత్రకు ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భార్యకు కొడుకు, ఇంకో భార్యకు కూతురు ఉంటారు. కూతుర్ని ప్రేమించేవాడిగా ‘అల్లరి’ నరేశ్ నటించాడు. అలీ కూడా హీరో లాంటి పాత్ర చేశాడు. మరాఠీ కథలో కొన్ని మార్పులు చేసి, శ్రీనివాసరెడ్డి అద్భుతంగా తీశాడు. పాటలు, కెమెరా పనితనం- అన్నీ బాగుంటాయి.
మరాఠీ కథలో ఏ పాత్రలు ఉంటాయో ఇందులోనూ అవే ఉంటాయి. నిజానికి, నరేశ్ పాత్రను విష్ణు, మనోజ్ కూడా చేయగలుగుతారు. కానీ, సినిమాలో నా కూతుర్ని ప్రేమించే పాత్ర కాబట్టి, కావాలనే వాళ్లతో చేయించలేదు. ఒక్కోసారి పాత్రలను పాత్రలానే చూడలేకపోతున్నాను. అందుకే వాళ్లతో చేయించలేదు. వేరే ఎవరైతే బాగుంటుందా అనుకున్నప్పుడు నరేశ్‌తో చేయిద్దామనుకున్నాం. నరేశ్ బాగా చేశాడు. టైమ్ అంటే టైమ్‌కి సెట్స్‌పైకి వచ్చాడు.
‘పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి. సినిమా జయాపజయాలు విధి మీద ఆధారపడి ఉంటాయ’ని నేను నమ్ముతాను. నేను తీసిన సినిమాల్లో విజయం సాధించినవీ ఉన్నాయి. పరాజయాలూ ఉన్నాయి. ఆ విషయాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాను. ఈ క్రిస్మస్కి మంచి సినిమా ఇవ్వాలనే ఆకాంక్షతో ఈ సినిమా చేశాను. నేను హిందు దేవుళ్లను మాత్రమే కాదు.. అందర్నీ పూజిస్తాను. ఆ దేవుళ్లూ, అలాగే నలభై ఏళ్లుగా నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకుల ఆశీస్సులూ ఉంటాయని నమ్ముతున్నాను. ఒక మంచి చిత్రం ద్వారా 2015కి వీడ్కోలు చెబుతూ, 2016కి నవ్వుతూ స్వాగతం పలకనున్నాం.