Ramyakrisna
-
కమల్‌తో శివగామి?
విశ్వనటుడికి శివకామి అర్ధాంగిగా మారనున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి రావడం తాజా వార్తే అవుతుంది. విశ్వనటుడంటే కమలహాసన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు శివగామి అన్నా నటి రమ్యక్రిష్ణ అని గుర్తు చేయనక్కర్లేదు. ఎందుకంటే బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు అంతగా జీవం పోసి ఆ చిత్రానికి వెన్నుముకగా నిలిచిన నటి రమ్యక్రిష్ణ. ఇంతకు ముందు ఇలానే పడయప్పా చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకిగా దీటుగా నటించి నీలాంబరిగా ప్రాచుర్యం పొందారు. నిజానికి రమ్యక్రిష్ణ తమిళం కంటే తెలుగులోనే అధిక చిత్రాలు చేశారు.అయితే పడయప్పా చిత్రంలో నీలాంబరి పాత్ర అంతకంటే అధికంగా ప్రాచుర్యం పొందారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ నటీమణులు ఇప్పటికీ నీలాంబరి లాంటి పాత్ర చేయాలని ఆశ పడుతుండడం ఆ పాత్రలో రమ్యక్రిష్ణ ఎంతగా ఒదిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక పంచతంత్రం చిత్రంలోనూ కమలహాసన్‌తో పోటీపడి నటించారు. ఆ చిత్రంలో నటి సిమ్రాన్ హీరోయిన్ అయినా రమ్యక్రిష్ణ పాత్రకే ప్రాధాన్యత ఉంటుంది.ఆ చిత్రం 2002లో విడుదలైంది.14 ఏళ్ల తరువాత ఈ శివగామి కమల్‌తో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంచలన నటికి విశ్వనటుడి నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. కమలహాసన్ నటించనున్న తాజా చిత్రానికి మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఇందులో కమల్‌కు భార్యగా నటి రమ్యక్రిష్ణను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. మరో విశేషం ఏమిటంటే ఇదే చిత్రంలో కమలహాసన్‌కు కూతురిగా ఆయన కూతురు, క్రేజీ హీరోయిన్ శ్రుతిహసన్ నటించనున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్‌ను అమెరికాలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నటి రమ్యక్రిష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. ఏదేమైనా బాహుబలి చిత్రం తరువాత ఈ ప్రౌడకు మరింత క్రేజ్ పెరిగిందన్నది నిజం. ఇప్పటికే నాగార్జునతో నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటించి తన సత్తాను మరో సారి చాటుకున్న రమ్యక్రిష్ట త్వరలో తన భర్త క్రిష్ణవంశీ దర్శకత్వంలో రుద్రాక్ష అనే తెలుగు చిత్రంలో నటించడానికి తయారవుతున్నారు. మరో పక్క బాహుబలి-2లోనూ నటిస్తూ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా బిజీగా ఉన్నారు. -
నేనా! ముఖ్యమంత్రా?
ముఖ్యమంత్రి జయలలిత ప్రతిభావంతురాలు. చాలా ధైర్యవంతురాలు అంటూ పొగడ్తల వర్షం కరిపిస్తున్నారు నటి రమ్యక్రిష్ణ. ఇంతకీ ఆమె సడన్‌గా ముఖ్యమంత్రిని పొగడాల్సిన అవసరం ఏమోచ్చింది. ఈ మధ్య నటీమణులు రాజకీయ రంగం ప్రవేశం అంటూ తెగ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొంపదీసి రమ్యక్రిష్ణకు కూడా అలాంటి ఆలోచన పుట్టుకొచ్చిందా? అనేగా మీ సందేహం. ఆమెకలాంటి ఆలోచన ఉందో? లేదో గానీ ప్రస్తుతానికి రమ్యక్రిష్ణ సినిమాల గురించే మాట్లాడుతున్నారు. నటి విద్యాబాలన్ దివంగత సంచలన శృంగార తార సిల్క్ స్మిత జీవిత చరిత్రలో నటిస్తుండగా మహిళా సంఘాలు ఆందోళనలు చేశాయి. అయినా ఆ చిత్రం విడుదలయ్యి విజయం సాధించడమే కాకుండా నటి విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు వరించింది. ఆ తరువాత కహాని, తదితర చిత్రాలు చేశారు.ప్రస్తుతం ఇందిరగాంధీ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో ఇందిరాగాంధీగా నటిస్తున్నారు. కాగా తమిళంలో ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర వెండితెర కెక్కనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఇందులో జయలలిత పాత్రలో నటి రమ్యక్రిష్ణ నటించనన్నారనే ప్రచారం జరుగుతోంది. పడయప్పా(తెలుగులో నరసింహా) చిత్రంలో నీలాంబరి, బాహుబలిలో శివకామి పాత్రల్లో ఒదిగి పోయిన రమ్యక్రిష్ణ చెవికి ఈ వార్త తాకడంతో ఆమె ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తానా? ముఖ్యమంత్రిగానా?అన్నారు. నిజంగా అలాంటి అవకాశం వస్తే అంతకంటే గర్వపడే విషయం ఏముంటుంది అన్నారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రతిభావంతురాలు. చాలా ధైర్యశాలిఅని కీర్తించారు. అయితే ఆమె పాత్రలో నటించాలని తన వద్దకు ఎవరూ రాలేదన్నారు. జరుగుతున్నదంతా అసత్యప్రచారం అంటూ కొట్టిపారేశారు.