వాన జోరు
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు మార్గాల్లో వాగులు పొంగి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ రిజర్వాయర్ దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పీ ప్రమోద్ కుమార్ ఆదేశించారు. రవాణాకు, ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్న చోట్ల గస్తీ పెట్టారు. గుండ్లకమ్మ రిజర్వాయరు గేట్లు నాలుగు ఎత్తివేశారు. రిజర్వాయర్‌లోకి వాన జోరు 12 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
దీంతో మద్దిరాలపాడు-చదలవాడ మధ్య ఉన్న బ్రిడ్జిపై నీరు ఉధృతంగా పారుతోంది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఈ మార్గంలో ఆర్టీసీ సర్వీసులు నిలిపేశారు. నాగులుప్పలపాడు ఎస్సై రంగనాథ్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించి వాహనాల రాకపోకలు పూర్తిగా ఆపేశారు. ఒంగోలు- చీరాల మధ్య వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా ఆర్టీసీ అధికారులు తిమ్మనపాలెం, హనుమాపురం, బీ నిడమానూరు మీదుగా నాగులుప్పలపాడు వైపు మళ్లించారు.
అలాగే ఒంగోలు-కొత్తపట్నం రహదారిలో ఉన్న ఉప్పువాగు బ్రిడ్జిపై భారీ లోడు వెళ్లడంతో ఇటీవల కుంగింది. సోమవారం ఉదయం నుంచి వర్షానికి ఈ బ్రిడ్జికి బీటలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలపరంగా నష్టంలేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.