'పన్నుమదింపు సరిగా లేదు'
మేడ్చల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను ఇటీవలే చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయి పర్యటనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామాన్ని శనివారం సందర్శించారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లి బిల్ కలెక్టర్, సెక్రటరీలను అడిగి పన్ను వసూళ్లు, ఆదాయ వనరుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామ పంచాయతీలు తమ పరిధిలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. పంచాయతీ కార్యాలయాల్లో పన్ను మదింపు సరిగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు.