‘రంగస్థలి’ నాటిక పోటీలు ప్రారంభం
ఆకట్టుకున్న తొలిరోజు ప్రదర్శనలు
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేటలోని సాంస్కృతిక సంస్థ రంగస్థలి 37వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 19వ ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రకాష్నగర్లోని భువనచంద్ర టౌన్హాల్లో మూడు రోజుల పాటు నాటిక పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి తొలిప్రదర్శనగా గణేష్పాత్రో కళావేదికపై తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారు ‘ఆగ్రహం’ నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులకు కారణమవుతున్న పురుషులకు తగిన శిక్ష విధించేలా కుటుంబం నుంచి వెలివేయడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. రచయిత,దర్శకుడు గంగోత్రి సాయి, సినీనటి డి.సరోజ తదితరులు నాటికలో ప్రధానపాత్రలను పోషించారు. అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కొలకలూరు శ్రియ ఆర్ట్స్ వారి ‘చాలు...ఇకచాలు’ నాటికలో కళ్లకు కట్టినట్టు చూపారు. మరో ప్రదర్శనలో విశాఖపట్నం లిఖితసాయి శ్రీక్రియేషన్స్ కళాకారులు రైతు స్వాభిమానం కథాంశంగా ‘మాకంటు ఓ రోజు’ నాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రదర్శనలకు ముందుగా.. తొలుత కొత్త పద్మావతి, సాంబశివరావు దంపతులు జ్యోతి ప్రజ్వలనను గావించారు. ఈ సందర్భంగా సీనియర్ చిత్రకారులు నందిగం నాగయ్యను ఘనంగా సత్కరించగా.. సభలో సీనీ, నాటక కళాకారుడు కెఎస్డి సాయి, రంగస్థలి ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కపిలవాయి విజయకుమార్, గౌరవ అధ్యక్షుడు కె.వి.కె. రామారావు, అధ్యక్షులు కిలారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎం.డి.ఎస్. పాషా, అధ్యాపకులు కె.రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాటిక పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.రామకోటేశ్వరరావు, ఎస్.బి. రమణ, ఎస్.వెంకటరెడ్డి వ్యవహరించారు.