రంజిత్ మహేశ్వరికి దక్కని అవార్డు
న్యూఢిల్లీ / కొచ్చి: ఇంకొన్ని గంటలైతే అర్జున అవార్డును అందుకుంటాననే ఆనందంలో ఉన్న ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరికి షాక్ తగిలింది. ఐదేళ్ల క్రితం డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడనే కారణంతో అవార్డుల జాబితా నుంచి రంజిత్ పేరును తాత్కాలికంగా తొలగించారు. ఈ విషయాన్ని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అధికారులు రంజిత్‌కు తెలిపారు. విచారణలో సచ్ఛీలుడిగా బయటపడితే తనకు ఈ అవార్డు దక్కుతుందని చెప్పారు. మరోవైపు సోమవారం వరకు వేచి చూడాల్సిందిగా క్రీడల మంత్రి తనతో చెప్పినట్టు రంజిత్ చెప్పాడు.
ఇదిలావుండగా రంజిత్ డోపింగ్ వ్యవహారంపై క్రీడా మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. సోమ లేదా మంగళవారం వరకు నివేదిక వచ్చే అవకాశం ఉందని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అవార్డుల బహూకరణ ముందు రంజిత్ విషయంలో ఇలా జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. 2008లో కొచ్చిలో జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నిర్వహించిన డోప్ టెస్టులో రంజిత్ విఫలమయ్యాడు.