కన్నడంలోనూ బాక్సాఫీస్‌కు దారిదే!
పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ గుర్తుందిగా! రిలీజ్‌కు ముందే పైరసీకి గురై, అందరినీ ఉలిక్కిపడేలా చేసిన సినిమా! అనేక అవాంతరాలను దాటుకొని విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నిటినీ దాటుకొని, తెలుగు చిత్రసీమలో రూ. 100 కోట్ల ఆదాయం దాటిన తొలి సినిమా! తమిళ, కన్నడ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ వసూళ్ళ వర్షం కురిపించిన తెలుగు సినిమా. విచిత్రమేమిటంటే, ఇప్పుడు ఇదే సినిమా మళ్ళీ కన్నడంలో వచ్చి, బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.
కన్నడంలో ‘రన్న’గా రీమేకైన మన ‘అత్తారింటికి దారేది’ అక్కడ ఈ జూన్ 4న విడుదలై, కాసుల వర్షం కురిపిస్తోంది. ‘ఈగ’ ఫేమ్ సుదీప్ ఇందులో హీరో. రచితారామ్ హీరోయిన్. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజే రూ. 3.6 కోట్ల దాకా వసూలు చేసి, మూడు రోజుల్లో 10 కోట్ల మార్కు దాటేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ రికార్డులన్నిటినీ తిరగరాసే అవకాశమున్నట్లు సినీ వ్యాపారవర్గాల భోగట్టా. కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో చేసిన ఈ సకుటుంబ కథా చిత్రం కన్నడ ప్రేక్షకులను వారి భాషలోనూ సమ్మోహితుల్ని చేస్తోంది.
కన్నడస్టార్ స్వర్గీయ డాక్టర్ విష్ణువర్ధన్ పాపులర్ డైలాగులను హీరో సుదీప్తో పదే పదే పలికించడంతో పాటు, అక్కడి నేటివిటీకి తగ్గట్లు చేసిన మార్పులు జనానికి పట్టాయని బెంగుళూరు వర్గాల ఉవాచ. రికార్డుల మాటెలా ఉన్నా, కొన్ని కథలు భాష, ప్రాంతాలకతీతంగా బాక్సాఫీస్‌కు దారిదే అని రుజువు చేస్తాయి కదూ!