ఇది మాటల ప్రభుత్వమే..!
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుదాం
– రాప్తాడు నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం : హామీలు తప్ప అమలు చేయని మాటల ప్రభుత్వానికి ఈనెల 9న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు మూడేళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చచడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు అనేక సమస్యలను సృష్టిస్తోందన్నారు. వ్యవసాయ రంగం కుదేలయ్యే విధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని పక్కనబెట్టి, కనీసం నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వలేదన్నారు.
ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ వాటి భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయడం లేదని చెప్పారు. వీటన్నటికంటే కూడా కీలకంగా ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం తెలుసుకునే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోందన్నారు. ఇలాంటి పోరాటాన్ని సమర్థిస్తున్నట్లే వైఎస్సార్సీపీ బలపరుస్తున్న పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు.
దీని వల్లే జరగబోయే ప్రయోజనాలను కూడా ఓటర్లు పరిశీలించాలన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయన్నారు. గోపాల్‌రెడ్డిని గెలిపిస్తే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఇంటింటికీ ఉద్యోగం అనే హామీని ఎంతో కొంత అమలు చేసే వీలుంటుందని చెప్పారు. లేదంటే కనీసం నిరుద్యోగ భృతి అమలు పునరాలోచించే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఎంఎస్ఎస్ సేవా సంస్థ అధ్యక్షుడు సాధిక్‌వలి పాల్గొన్నారు.