Rapur
-
రాపూరు పీఎస్‌పై దాడి ఘటన: ఎస్ఐ బదిలీ
రాపూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎస్ఐ లక్ష్మణరావును బదిలీ చేశారు. ఈ మేరకు లక్ష్మణరావు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఎస్ఐగా చల్లా వాసును నియమించారు. కాగా, శుక్రవారం రావూలో జాతీయ ఎస్.సి, ఎస్.టి కమిషన్ సభ్యుడు రాములు పర్యటించనున్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడితో పాటు దళిత కాలనీని రాములు సందర్శించనున్నారు. గత వారం కొంతమంది పోలీస్ స్టేషన్ గేట్లు ధ్వంస చేసి లోనికి చొరబడ్డ విషయం తెలిసిందే. దళితవాడకు చెందిన కొందరు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాదాపు 40 మంది స్టేషన్లోకి ప్రవేశించి విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం దాడులకు తెగబడ్డారు. -
సుమో బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు
రాపూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ) : పెంచలకోన పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా సుమో బోల్తాపడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం జరిగింది. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విమంగా ఉండడంతో వారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురికి రాపూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రులందరూ వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గం సుండుపల్లి సమీపంలోని జంగాలపల్లి గ్రామానికి చెందినవారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
రాపూరు (నెల్లూరు జిల్లా) : రాపూరు శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. డక్కిలి మండలం దేవుడు యల్లంపల్లికి చెందిన వారధి(50), చంద్ర (45) మోటార్ బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్ నడుపుతున్న వారధి అక్కడికక్కడే మృతిచెందగా, చంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని డక్కిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.