చిన్నారి గుండెకి అరుదైన ఆపరేషన్!
ముంబై: అందరికి గుండె చాతీకి ఎడమవైపు ఉంటే, ఆ బాలునికి కుడివైపు ఉంది. అంతేకాక దానికో పెద్ద రంధ్రంతో పాటు, ఊపిరితిత్తులకు వచ్చే ధమనులు కుచించుకుపోయి ఉన్నాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ముంబైలోని సర్.హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ హస్పిటల్, రిసర్చ్ సెంటర్ వైద్యులు ఆ బాలునికి వైద్యం చేయడానికి ముందుకొచ్చి ఆ చిన్ని గుండెకు శస్త్రచికిత్స చేసి అందరిలా ఆరోగ్యవంతున్ని చేశారు.
ఔరంగాబాద్‌కు చెందిన పేద రైతు కొడుకు సంకేత్ మోరే (6) హృదయ సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఈ నెల 19న బైపాస్ సర్జరీ చేశారు. ‘ఎంతో సంక్లిష్టతో కూడిన శస్త్ర చికిత్సను అనుకున్న సమయానికే మేం పూర్తిచేశాం. మరో వారం రోజుల్లో సంకేత్ ఇంటికి వెళ్తాడు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడ’ని శస్త్ర చికిత్సలో పాల్గొన్న సీనియర్ పిల్లల వైద్యుడు శ్రీపాల్ జైన్ చెప్పారు.
చికిత్సకు కోసం రెండు ప్రణాళికలు వేశామని ఒకటి వీలైనంత త్వరగా సర్జరీ పూర్తి చేయడం, రెండు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని కలగకుండా ధమనులను సరిచేయడమని ఆయన వివరించారు. ఇందుకోసం బైపాస్ యంత్రాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. దేశంలో కొన్ని ఆసుపత్రుల్లోనే ఇలాంటి చికిత్స అందించడానికి సరైన సదుపాయాలున్నాయని జైన్ పేర్కొన్నారు.