రంపచోడవరం అడవుల్లో 15 అడుగుల కోబ్రా
రాజమండ్రి: ఐదడగుల నాగ పాముల్ని చూస్తేనే అదొక వింతలా భావిస్తుంటాం. అటువంటిది ఏకంగా 15 అడుగుల అరుదైన కింగ్ కోబ్రా కనపడితే..అమ్మో ఇంకేముంది. నోళ్లు యెళ్లబెట్టి ఆశ్చర్చం వ్యక్తం చేస్తాం. అటువంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అడవుల్లో చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో నివసిస్తున్నఓ వ్యక్తి ఇంటి దగ్గర్లో భారీ కింగ్ కోబ్రా విపరీతమైన శబ్దాలు చేయడంతో గమనించిన అతను అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.
దీంతో అక్కడి చేరుకున్న అటవీశాఖ అధికారులు నాలుగు గంటలకు పైగా శ్రమించి ఆ త్రాచుని చాకచక్యంగా వలల సాయంతో పట్టుకున్నారు. అక్కడి నుంచి ఆ కింగ్ కోబ్రాను విశాఖ జూలాజికల్ పార్క్ కు తరలించారు. కింగ్ కోబ్రా అనేది ప్రపంచలోని అత్యంత విషపూరితమైన జంతువని అటవీ అధికారులు తెలిపారు. ఈ తరహా పాములు భారతదేశంలోని అడవుల్లోనే ఎక్కువగా ఉంటాయన్నారు.