ఒడిశాకు రేపు కేంద్ర పరిశీలన బృందం
పై-లిన్ తుపాన్ తాకిడితో ఒడిశా రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ తుపాన్ సృష్టించిన బీభత్సంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం బృందం సోమవారం ఒడిశా రానుందని ఆ రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. ఆ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రష్మీ గోయెల్ నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఆ కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోతుందని చెప్పారు.
పైలిన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న గంజాం, పూరీ, బాలసోర్, మయూర్ బంజ్ జిల్లాల్లో ఆ బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. ఆ బృందాలు ఈ నెలాఖరు వరకు ఒడిశాలో పర్యటిస్తాయని చెప్పారు. పై లిన్ తుపాన్‌తో వచ్చిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల 60 మంది మృత్యువాత పడ్డారు. అలాగే వీపరితమైన ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు మూడు లక్షల చెట్లు నెలకొరిగాయి. రోడ్డు, రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఒడిశాలో పై లిన్ తుపాన్ వల్ల నెలకొన్న నష్టంపై కేంద్ర బృందం అధ్యాయనం చేసి కేంద్రానికి నివేదిక అందజేయనుంది.