హస్తం హవా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ప్రతిపక్ష జేడీఎస్‌కు పెట్టని కోటల్లా ఉన్న బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ రెండు స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరుగగా, శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆది నుంచీ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను సాధిస్తూనే వచ్చారు. బెంగళూరు గ్రామీణలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే. సురేశ్, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామిని 1,37,000 ఓట్ల తేడాతో ఓడించారు. సురేశ్‌కు 5,78,596 ఓట్లు, అనితా కుమారస్వామికి 4,41,600 ఓట్లు లభించాయి.
మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి రమ్య చేతిలో జేడీఎస్ అభ్యర్థి సీఎస్. పుట్టరాజు 67,611 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రమ్యకు 4,84,085 ఓట్లు, పుట్టరాజుకు 4,16,474 ఓట్లు లభించాయి. జేడీఎస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి ఎన్. చలువరాయస్వామిల రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగాయి. వారిద్దరూ గత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు.
సిద్ధుకు మరింత బలం
ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పార్టీలో మరింత బలవంతుడిని చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావించాయి. సిద్ధరామయ్య వంద రోజుల పాలనపై కూడా ఈ ఫలితాలను తీర్పుగా అభివర్ణించాయి. దీంతో ఆయన అభ్యర్థుల ఎంపిక సమయం నుంచే జాగ్రత్త పడ్డారు. పార్టీలో అందరినీ ఏకతాటిపై నడిపించారు. మంత్రి పదవి రాకపోవడంతో అలిగి కూర్చున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్‌ను బుజ్జగించే చర్యల్లో భాగంగా ఆయన తమ్ముడినే పార్టీ అభ్యర్థిగా అధిష్టానం చేత ఖరారు చేయించారు.
జేడీఎస్ అధినేత దేవెగౌడ కుటుంబీకులకు శివకుమార్ రాజకీయంగా ఆగర్భ శత్రువు. ఆయన మద్దతు లేనిదే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమని భావించిన ముఖ్యమంత్రి గెలుపు భారాన్ని ఆయనపైనే మోపారు. ఇక మండ్యలో సుమారు 60 శాతం మంది దాకా దేవెగౌడ సామాజిక వర్గమైన ఒక్కలిగులు ఉన్నారు. లోక్‌సభ నియోజక వర్గంలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఐదింటిలో జేడీఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్‌కు ప్రచార బాధ్యతలను అప్పగించారు. అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణతో అంబరీశ్‌కు విభేదాలున్నాయి.
కృష్ణకు ఆమోదయోగ్యంగా ఉంటుందని రమ్యను అభ్యర్థిగా ఖరారు చేయించారు. దీంతో ఇద్దరూ ఇష్టం లేకపోయినా పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఒకే వేదిక ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అన్నిటికీ మించి అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు తోడు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకపై గట్టి అంచనాలను పెట్టుకుని ఉంది. ఈ సత్యాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి విజయం కోసం చక్కటి వ్యూహాన్ని రూపొందించి, పకడ్బందీగా అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే కావస్తున్నందున, జేడీఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రయోజనమేమిటనే ఓటరు తర్కం కూడా అంతిమంగా అధికార పార్టీ అభ్యర్థుల మెడలో విజయ మాల పడేలా చేసింది.
వ్రతం చెడ్డా....
ఉప ఎన్నికల్లో విజయం కోసం లౌకిక వాదాన్ని కాసేపు పక్కన పెట్టి బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా జేడీఎస్ విజయం సాధించలేక పోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని రామనగర, చన్నపట్టణ అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు. జేడీఎస్‌ను ఆది నుంచీ వారు ఆదరిస్తూనే వస్తున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టడంతో ఆ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి డీకే. సురేశ్‌కు లభించిన భారీ మెజారిటీ ఈ మర్మాన్ని చెప్పకనే చెబుతోంది. ‘మీరు గత ఎన్నికల్లో కుమారస్వామిని గెలిపిస్తే ఒక నాడైనా లోక్‌సభకు వెళ్లారా. ఆయనే వెళ్లనప్పుడు ఆయన సతీమణి వెళతారని ఊహించగలమా? జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబ పెత్తనం ఎక్కువ అని అంటే ఆ పార్టీ నాయకులకు మా చెడ్డ కోపం వస్తుంది. అనితా కుమారస్వామి మినహా వేరే అభ్యర్థి ఆ పార్టీలో లేరా. కుమారస్వామి అధికార దాహం వల్ల కేవలం స్వల్ప కాలానికి ఈ ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రచారం ఓటర్లలో తారక మంత్రంలా పని చేసింది.
రెంటికీ చెడ్డ రేవడి
మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. మండ్యలో ఆ పార్టీకి పెద్దగా ఉనికి లేనప్పటికీ, బెంగళూరు గ్రామీణలో పట్టుంది. ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు లక్షలు దాకా ఓట్లు పోలయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉమ్మడిగా ఎదుర్కొన్నా కాంగ్రెస్‌ను ఓడించలేక పోయిందని అపహాస్యానికి గురైంది.