ఓటుకు రేటు..ఎరేస్తున్నారు
పట్టణాల్లో పట్టు కోసం యత్నాలు
మున్సిపల్ ఓటర్లకు ప్రలోభాలు
పోలీసు నిఘాతో చీరలు, నజరానాల పంపిణీకి చెక్
డబ్బు పంపిణీకే పెద్దపీట
జోరుగా విందు రాజకీయాలు
ఇదీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రలోభాల తీరు
మున్సిపాలిటీల్లో ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. పట్టణాల్లో పట్టు దక్కించుకునేందుకు ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఓటుకు రేటు కడుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రెండు రోజులుగా విందు, రాజకీయం జోరుగా సాగిస్తున్న అభ్యర్థులు పోలింగ్ సమయం సమీపించడంతో నజరానాల పంపిణీపై దృష్టి పెట్టారు.
సాక్షి, మచిలీపట్నం : పురపోరుకు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో శుక్రవారం రాత్రి నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో డబ్బు పంపిణీ మొదలైంది. ఈసారి ఎన్నికల కమిషన్ కాస్త పట్టు బిగించడంతో నజరానాల కంటే డబ్బు పంపిణీ పైనే అభ్యర్థులు ఎక్కువగా ఆధారపడ్డారు. తిరువూరులో గత రెండు రోజులుగా పలువురు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు తమ పరిధిలోని ఇంటింటికి కోడి మాంసం, వేట మాంసం కిలో చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలలో నిఘా కట్టుదిట్టం చేయడం, పోలీస్ చెక్‌పోస్టుల తనిఖీల హడావుడితో చీరలు, వెండి వస్తువులు వంటి నజరానాలను పట్టణ ఓటర్లకు అందించేందుకు అభ్యర్థులు ధైర్యం చేయలేదు. దీంతో ఒకటి రెండు పట్టణాల్లో మినహా అన్నిచోట్లా గతంలో మాదిరిగా చీరలు తదితర వస్తువుల పంపిణీ పెద్దగా జరగలేదు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోను గెలుపు కోసం అభ్యర్థులు తమ స్తోమతును బట్టి డబ్బు పంపిణీ చేపట్టారు. వార్డుల్లోనూ ఓటుకు రూ.200 నుంచి రూ.500...
పలు మున్సిపాలిటీల్లో వార్డులకు సైతం ఓటుకు రూ.200 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. ఉయ్యూరు, జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీల్లో సంపన్న వర్గాలు పోటీచేసిన వార్డుల్లో పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఓటుకు రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు.
ప్రలోభాల పర్వం ఇలా...
మచిలీపట్నంలో పలువురు అభ్యర్థులు పంతాలకు పోయి డబ్బు ఖర్చు చేస్తున్నారు. చాలాచోట్ల ఓటుకు రూ.200 నుంచి 500 వరకు పంపిణీకి సిద్ధమవుతుండగా, కొన్నిచోట్ల వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ చీరలు తెచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేయడం, వారి విధినిర్వహణకు అడ్డు వచ్చిన కౌన్సిలర్ అభ్యర్థిపై కేసు పెట్టి అరెస్టు చేసి. వ్యక్తిగత బెయిల్‌పై విడుదల చేయడం తెలిసిందే. దీంతో చీరల పంపిణీని అభ్యర్థులు విరమించుకున్నారు.
పెడనలోని ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి ఒకరు శుక్రవారం ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ మొదలుపెట్టారు. మరో వార్డులో చీరలు ఇచ్చి మహిళల ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు.
గుడివాడలో ఓటు రేటు వెయ్యి పలుకుతోంది.
నూజివీడులో రూ.500 నుంచి వెయ్యి వరకు పంపిణీ చేపట్టారు.
తిరువూరులో ఓటుకు వెయ్యి ఇస్తారని ప్రచారం జరిగినా శుక్రవారం రూ.500 చొప్పున పంపిణీ మొదలుపెట్టారు.
మద్యం పెద్ద ఎత్తున పంపిణీ చేసి పలావు కూడా పెడుతున్నారు. ఇంటింటికి కోడిమాంసం, వేట మాంసం పంపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం రోజుకు రూ.200 చొప్పున ఇస్తామని కిరాయి మనుషులను వెంట తిప్పుకొన్న టీడీపీ అభ్యర్థులు వారం రోజులైనా వారికి డబ్బులివ్వకపోవడంతో వివాదం నెలకొంది. శుక్రవారంతో ప్రచారం ముగియడంతో ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.1,400 మొత్తాన్ని ఇవ్వకపోవడంతో వాళ్లు లబోదిబోమంటున్నారు.
నందిగామ ఓటు రేటు రూ.500 నుంచి రూ.5 వేలు పలుకుతోంది. సంపన్న వర్గాలు పోటీ చేసే రెండు వార్డుల్లో ఓటు రేటు బాగా పలుకుతోంది. ఏకంగా రూ.5 వేలు వరకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.
జగ్గయ్యపేటలో ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.5 వేలు వరకు ఇస్తున్నారు. ప్రధానంగా సంపన్నవర్గాలు ఉండే వార్డుల్లో ప్రతిష్టాత్మకంగా మారడంతో ఏకంగా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకోవడం విశేషం.
ఉయ్యూరులో రూ.500 నుంచి రూ.1500 వరకు పంపిణీ చేశారు. ఒక వార్డులో 1500 చొప్పున పంపిణీ పూర్తి చేశారు. చీరలు, గాజులు, కుంకుమ, పసుపు కూడా పంపిణీ చేసి సెంటిమెంట్ ఓటుతో గట్టెక్కేందుకు అభ్యర్థులు ఎత్తులు వేయడం కొసమెరుపు.