అమ్మకాలు తగ్గినా..ఆదాయం ఘనమే..!
ఆదిలాబాద్ : జిల్లాలో ఈ ఏడాది మద్యం విక్రయాలు భారీగా తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం గతేడాది కంటే ఎక్కువ గానే ఉంది. గతం కంటే ఈ ఏడాది మద్యం రేట్లు భారీగా పెరగడంతోనే ఆదాయం అధికంగా వచ్చింది. అయితే ఆబ్కారీ శాఖ అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి. అనుకున్నదొకటైతే.. అయింది మరొకటన్నట్లు విక్రయాలు తగ్గినా ఆదాయం గ తేడాదిని మించి రావడంతో కొంత ఊరట చెందారు.
తగ్గిన విక్రయాలు
ఎక్సైజ్ శాఖ పరంగా ప్రతి ఏడాది జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు వార్షిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈనెల చివరితో 2013-14 మద్యం వార్షిక సం వత్సరం ముగియనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మద్యం దుకాణాల కోసం టెండర్లను ఆహ్వానించింది. జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రారంభం కానుంది. కాగా 2012-13, 2013- 14లో విక్రయాలను గమనిస్తే... 2012-13లో ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) 11,64,600 కేసులు, 12,62,083 బీర్ కేసులు విక్రయించారు.
దాని ద్వారా రూ.476.46 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. 2013-14లో ఐఎంఎల్ 10,91,208 కేసులు, బీర్ 11,39,046 కేసులు విక్రయించగా ప్రభుత్వానికి రూ. 494.45 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన గతేడాది, ఈ ఏడాది విక్రయాలను పరిశీలిస్తే ఐఎంఎల్ కేసులు 73, 392, బీర్ 1,23,037 కేసులు తక్కువగా అమ్ముడుపోయాయి. అయితే ఈ ఏడాది రెండు మూడు రేట్లు మద్యం ధరలను పెంచడంతో ఆదాయం మాత్రం గత ఏడాదిని మించి లభించింది. గతేడాది కంటే ఈ ఏడాది రూ.17.99 కోట్లు అధికంగా సమకూరింది.
ఎన్నికల ఏడాదైనా తక్కువే...
2013-14లో ఎన్నికలనామ సంవత్సరంగా మిగిలినా ఎక్సైజ్ శాఖకు మాత్రం ఆదాయంపరంగా మొండిచేయే ఎదురైంది. ఎన్నికల వేళ మద్యం విక్రయాలు పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టాయి. ఈ తిరోగమనం ఆబ్కారీ శాఖకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాదిలో సహకార, పంచాయతీ, మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల సంగ్రామం నడిచింది. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు మద్యం విక్రయాలకు ప్రతిబంధకంగా మారాయి. ఆ నెలలో గతేడాది అదే నెలలో అమ్మిన విలువను మించరాదని నిబంధన ఉండడం దీనికి కారణమైంది. దీనికి తోడు మహారాష్ట్ర నుంచి దేశీదారు అక్రమ రవాణా రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టింది. దీంతో ఎక్సైజ్ శాఖకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు.