ratio of boys and girls
-
ఆడబిడ్డల ఆంధ్రప్రదేశ్.. పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అబ్బాయిలను మించి ఆడపిల్లల సంఖ్య పెరిగిపోతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021–22 లేబర్ ఫోర్స్ సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది. జూలై 2021 నుంచి జూన్ 2022 మధ్య సర్వే నిర్వహించినట్టు నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద చూస్తే.. 8 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమ్మాయిలు కన్నా అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2019–20లో జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 968కు పెరిగింది. అలాగే రాష్ట్రంలో 2019–20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 1,046కు పెరిగింది. అక్కడ అబ్బాయిలే అధికం రాష్ట్రంలో మొత్తం 1,41,28,100 కుటుంబాలుండగా.. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 96,72,100, పట్టణ ప్రాంతాల్లో 44,56,000 కుటుంబాలున్నట్టు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో సగటు కుటుంబ పరిమాణం 3.3గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3.4గా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 3.2గా ఉందని నివేదిక తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్– హవేలీ–డామన్–డయ్యూలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు కేవలం 742 మందే ఉన్నారు. ఆ తర్వాత చండీగఢ్‌లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 879 మంది, హరియాణాలో 887 మంది, ఢిల్లీలో 891 మంది అమ్మాయిలున్నారు. గ్రామాల్లో కన్నా పట్టణాల్లో ఎక్కువ 2021–22లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,038 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,063 మంది అమ్మాయిలున్నారు. అలాగే 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,007 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,051 మంది అమ్మాయిలున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లోనే అమ్మాయిల సంఖ్య అత్యధికంగా ఉంటోందని స్పష్టమవుతోంది. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనే ధోరణి నుంచి క్రమంగా మగైనా ఆడైనా ఒకరే చాలనే వరకూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆడిపిల్లల సంఖ్య పెరుగుతూ వస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
బేటీ..పిటీ!
సిటీబ్యూరో: పట్ణణ ప్రాంతాల్లో పేదరికం, ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి ఇటీవలి సోషియో ఎకనమిక్ సర్వే తేల్చిన అంశాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు. ముఖ్యంగా అభివృద్ధిపథంలోకి దూసుకెళుతోందనుకుంటున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బాలబాలికల నిష్పత్తి తెలంగాణ రాష్ట్ర సగటు బాలబాలికల నిష్పత్తికంటే కూడా అతి తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం మొత్తంమీద బాలబాలికల నిష్పత్తిలో అంతరాలు కొంత తగ్గినట్లుగా కన్పిస్తున్నా... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి కొంత మెరుగ్గానే ఉంది. తెలంగాణలో బాలబాలికల నిష్పత్తి గత పదేళ్ళలో ప్రతి వెయ్యిమంది బాలురకి 971 బాలికల నుంచి 988 బాలికలకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో ప్రతి వెయ్యిమంది బాలురకి రాష్ట్ర సగటుకంటే అతి తక్కువగా 954 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలలో ప్రతి వెయ్యిమంది బాలురకు 961 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ రెండు జిల్లాల పరిధిలో పేదరికం, నిరక్షరాస్యత, లింగనిర్ధారణ పరీక్షల ప్రభావం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. కాగా షెడ్యూల్డ్ కులాల్లో మాత్రం బాలికలు బాలురకన్నా (రాష్ట్ర సగటుకన్నా) అధికంగా ఉన్నట్టు తేలింది. ప్రతి వెయ్యిమంది బాలురకు 1008 మంది బాలికలు షెడ్యూల్డ్ క్యాస్ట్ కుటుంబాల్లో ఉండడం గమనార్హం. ఆదివాసీల్లోనైతే ప్రతి వెయ్యిమంది బాలురకి 977 మంది బాలికలు ఉన్నట్టు నమోదయ్యింది. అలాగే 0–6 వయసు బాల బాలికల నిష్పత్తిలో సైతం చాలా తేడా కనిపిస్తోంది. ఈ వయసు బాలబాలికల్లో ప్రతి వెయ్యిమంది బాలురకి బాలికల సంఖ్య 957 నుంచి 932కి పడిపోయింది. ఈ విభాగంలో హైదరాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలు చిట్టచివరి స్థానాల్లో ఉండడం గమనించాల్సిన విషయం. బాల్య వివాహాలు ఎక్కువే.. బాల్య వివాహాల విషయానికొస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్లు సోషియో ఎకనమిక్ సర్వేలో తేల్చారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో బాల్యవివాహాలు 3.7 శాతంగా ఉంటే తెలంగాణలో కొంత తగ్గి 2.1 శాతంగా ఉంది. అయితే 2017– సోషియో ఎకనమిక్ సర్వేలో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వీటికి పలు అంశాలను కారణాలుగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హైటెక్ సిటీగా పేరొంది...అభివృద్ధిలో దూసుకుపోతూ ఆదర్శ నగరంగా కీర్తిస్తున్న హైదరాబాద్ నగరంలో బాల్యవివాహాలు, బాలికల సంఖ్య తగ్గడం వంటి అంశాలు మచ్చలుగానే చెప్పొచ్చు.