కార్డుదారులకు ప‘రేషన్’
* కొన్ని గంటల్లో నిలిచిపోనున్న సరుకుల పంపిణీ
* ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న గడువు
* ఇప్పటివరకు జిల్లాలో 79.55 శాతమే పంపిణీ
* పేదలకు కష్టాలు ..డీలర్లకు అవస్థలు
చిలకలూరిపేట: అంతా హడావుడి... రేషన్ పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన సమయం అటు డీలర్లకు, ఇటు రేషన్‌కార్డుదారులకు ఇబ్బందిగా మారింది. కూలి పనులు మానుకొని పేదలు రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా 10వ తేదీ లోగానే రేషన్ సరుకుల పంపిణీ విధానం విమర్శల పాలవుతోంది. ఇక కొన్ని గంటల్లో సరుకుల పంపిణీ నిలిచిపోనుంది.
ప్రచారం ఏదీ..?
ఒక పథకంలో మార్పులు , చేర్పులు, సవరణలు చేయాలనుకున్నప్పుడు పథకంపై విసృత ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ డీలర్ల సమావేశం నిర్వహించి నిర్దేశించిన గడువులోగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించటంతో వారు హడావుడిగానే సరుకుల పంపిణీ ప్రారంభించారు. పది రోజు ల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ దుకణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉం డగా జిల్లాలో కొంతమంది డీలర్లు రెండు, మూడు తేదీలలో మాత్రమే సరుకుల పంపిణీ చేస్తున్నారు.
పథకం పై ప్రచారం కొరవడటంతో ఎప్పటిలాగే సరుకులు అందజేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఆ నోట, ఈ నోట విషయం తెలిసి పరుగున రేషన్‌షాపులకు వచ్చిన పేదలకు ఈ-పాస్ విధానం ఎప్పటిలాగే చుక్కలు చూపించింది. అప్పుడప్పుడు సర్వర్ మెరాయిస్తుండటంతో ప్రజలకు అవస్థతలు తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎంఎల్ పాయింట్ల నుంచి రేషన్ సరకుల పంపిణీ ఆలస్యంగా జరగటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
అధికార వెబ్సైట్లో వివరాలు..
ఇంతా చేసి ఈ నెల 8తేదీ నాటికి జిల్లాలో 79.55 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ అధికార వెబ్సైట్లో పొందుపరిచారు. ఇదీ నమ్మశక్యంగా లేదు. జిల్లాలోని మొత్తం 2728 రేషన్ దుకాణాల ద్వారా 13,58,883 కార్డుదారులకు మొదటిరోజు అంటే మార్చి ఒకటో తేదీన 6.68 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారు. మార్చి రెండో తేదీ నాటికి 20.17, మార్చి 5వ తేదీకి 58.16 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు గణాంకాలు రూపొందించారు. ముగింపు(10వ)తేదీకి పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రజల నుంచి అనుకున్న స్పందన రాకపోవటంతో ముందుగా ఐదోతేదీవరకు మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. తర్వాత దాన్ని 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కొన్ని మండలాలల్లో పౌరసరఫరాల అధికారులు హడావుడి చేయటం విశేషం.
సాధించేది ఏమిటి?
ఇటు డీలర్లను, అటు పేదలను ఇబ్బందులు పెట్టడం మినహా నిర్దేశించిన 10 రోజల కాలపరిమితితో సాధించిందేమిటన్నది సమాధానం లేని ప్రశ్న. కూలినాలి చేసుకొని జీవించే సగటు జీవులు ఏ మాత్రం ఉపక్షేంచినా ఆ నెల రేషన్ వదులుకోవాల్సి వస్తుందని ఉరుకులు పరుగులు పెట్టారు. వలసకూలీలు తప్ప ని సరిగా పనులు మానుకొని సరకులు తీసుకువెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.