రేషన్ గోధుమలు ఇక చౌక
కిలో రెండు రూపాయలకే అందించాలని నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించనుంది. గోధుమలను చౌకధరలకు అందించాలని, వాటి పరిమాణం పెంచాలని నిర్ణయించింది. రూ.2కే కిలో గోధుమలను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతోంది. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా కేంద్రం నిర్ణయించిన ధరల్లో గోధుమలు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. రాష్ట్రానికి అవసరమైన గోధుమలన్నింటినీ కేంద్ర ఆహార సంస్థ(ఎఫ్సీఐ) రాష్ట్రానికి సమకూర్చనుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఈ నెల నుంచి కేంద్రం గోధుమలు సరఫరా చేయాలని నిర్ణయించింది.
అందులో భాగంగా తెలంగాణకు 8,260 మెట్రిక్ టన్నుల మేర గోధుమలను కేంద్రం కేటాయించింది. అయితే, రాష్ట్రంలో ఇప్పటికే అమ్మహస్తం రూ.7కు కిలో చొప్పున కిలో గోధుములు, మరో కిలో గోధుమపిండి సరఫరా చేస్తున్నా వాటికి డిమాండ్ ఉండటం లేదు. 1500 మెట్రిక్ టన్నుల మేర గోధుమలను కొనేందుకు ముందుకు రాకపోవడంతో వాటి స్థానంలో అదనపు బియ్యాన్ని సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్రం విన్నవించింది. దీనిపై సానుకూలత తెలపని కేంద్రం గోధుమల సరఫరాకే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 2 కిలోలు, పట్టణాల్లో 5 కిలోల చొప్పున రూ.2కే గోధుమలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.