కాలిన కట్టెలా ‘రత్నాచల్’
తూర్పు గోదావరి: ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలకు నిలువునా కాలిన కట్టెలా మిగిలింది. ఆదివారం తుని మండలం వెలమ కొత్తూరు సమీపంలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఆందోళనకారులు ఈ రైలును తగులబెట్టిన విషయం తెలిసిందే.
సోమవారం ఉదయం సంఘటనా స్థలం నుంచి రత్నాచల్‌ను తుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాలిన రైలును చూసేందుకు తుని పరిసర ప్రాంతాల పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కాగా, రత్నాచల్‌ను లూప్‌లోకి తరలించడంతో ఇతర రైళ్లు నడపడానికి వీలు కలిగింది. జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాంకేతిక సిబ్బంది కాలిపోయిన బోగీలను పరిశీలించారు. విజయవాడ-విశాఖల మధ్య రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినా..కొన్ని రైళ్ల రద్దు, మరి కొన్నింటి ఆలస్యంతో సోమవారం తుని స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది.