రత్నమయ్య అక్రమాస్తులు రూ. 7 కోట్లపైనే
అనంతపురం : ప్రస్తుతం ఓడీ చెరువు తహశీల్దార్గా పనిచేస్తున్న రత్నమయ్య రూ.7కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు బుధవారం నిగ్గు తేల్చారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో అనంతపురం ఏసీబీ డీఎస్పి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం, బెంగళూరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో ఏడు ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంగళవారం ఈ దాడులు మొదలైయ్యాయి. ఈ దాడుల్లో బెంగుళూరులో రెండు బంగళాలు, చిత్తూరు జిల్లా మదనపల్లెలో మేడలు, ఇళ్లు, అనంతపురంలో అపార్ట్మెంట్లు, హిందూపురంలో ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
అలాగే పలు కీలక పత్రాలు, ఖాళీ చెక్కులు, 25 తులాల బంగారు నగలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రత్నమయ్య నంబులుపూలకుంటలో తహశీల్దార్గా పనిచేసినపుడు సోలార్సిటీకి వ్యవహారంలో కోట్ల రూపాయిలు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే చిలమత్తూరు తహశీల్దార్గా పని చేసినపుడు కూడా ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఏడుచోట్ల దాడులు నిర్వహించారు. తహశీల్దార్ అక్రమాస్తుల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది.