గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో భారీగా ఎలుకల పట్టివేత
ఐసీయూలో చికిత్స పొందుతున్న పసికందును ఎలుకలు కొరకడంతో మరణించిన ఘటన దేశ విదేశాలలో కూడా సంచలనం కలిగించింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఈ విషయం గురించిన కథనాన్ని ప్రచురించాయి. జాతీయ మీడియా కూడా దీనిపై దుమ్మెత్తిపోసింది. దీంతో అధికారులలో ఎట్టకేలకు చలనం వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పదిమందితో కూడిన ఓ బృందం ఆస్పత్రికి చేరుకుని, తమదైన పద్ధతిలో బోనులు, ఎరలు ఏర్పాటుచేసింది. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 వరకు ఎలుకలు పట్టుబడ్డాయి. వాళ్లు పట్టుకున్న ఎలుకలను చూసి.. అసలు ఇది గుంటూరు ప్రభుత్వాస్పత్రేనా.. మరేదైనానా అని అంతా విస్తుపోయారు. ప్రస్తుతం ఆస్పత్రి మొత్తాన్ని శుభ్రం చేయించే పనిలో అధికారులు పడ్డారు.