రావణ వాహనంపై ఆది దంపతులు
- రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 17న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై భక్తులకు కన్నుల పండువగా దర్శనమిచ్చారు. సాయంత్రం 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు రావణ వాహనానికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, ఈఓ దంపతులు పాల్గొన్నారు.
విశేషపూజల అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం మీదుగా రథశాల వద్దకు చేర్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి నారీకేళం సమర్పించి ఈఓ గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కనులపండువగా సాగింది. రాత్రి 9.30 గంటలకు గ్రామోత్సవం తిరిగి ఆలయ ప్రాంగణం చేరుకుంది. భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవానికి రాష్ట్రప్రభుత్వం తరుపున మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు.