విధుల్లో చేర్చుకునేది లేదు
శ్రీకాకుళం టౌన్ : విధుల్లో చేర్చుకునేది లేదని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు శ్రీకాకుళం చేరుకున్న బి.రవిచంద్రకు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్‌ను కలిసేందుకు డీబీసీ కలెక్టరేటుకు వచ్చారు. అయితే రిమ్స్‌లో జరిగిన సెమినార్‌కు వెళ్లిన కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎంతసేపటికీ రాకపోవడంతో మధ్యాహ్నం వరకు అక్కడే వేచి ఉన్నారు. ఆయనతోపాటు దళిత సంఘ నాయకుడు బేసి మోహనరావు కూడా కలెక్టరేటుకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు కలెక్టరు తన చాంబరులోకి చేరుకున్న తర్వాత తిరిగి రవిచందర్ ఆయన్ను కలిశారు. తనను విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. అయితే అందుకు కలెక్టరు తిర్కరించడంతో వెనుదిరిగారు.
కలెక్టరుకు లేఖ..
రవిచంద్ర బీసీ సంక్షేమ శాఖాధికారిగా పనిచేస్తుండగా జూనియర్ అసిస్టెంట్ బాలరాజును సస్పెండ్ చేయాలని కలెక్టరు సూచించారు. ఆ సూచనను ధిక్కరించినందుకు రవిచంద్రను కలెక్టరు ఇటీవల ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సరెండర్‌కు 10 కారణాలు చూపిస్తూ ఆదేశాలిచ్చారు. వాటిని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ముందుంచిన రవిచంద్ర తనకు జరిగిన అన్యాయంపై వివరణ ఇచ్చారు. దీనిపై ముఖ్యకార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. సరెండర్‌కు గల కారణాలు సరైనవి కావంటూనే వాటిపై మీరెలాంటి చర్య తీసుకున్నారో వివరణ ఇవ్వాలని కలెక్టరుకు లేఖ పంపించారు.
పది అంశాలను అందులో ప్రస్తావిస్తూనే ప్రస్తుత ఇన్చార్జి డీబీసీగా వ్యవహరిస్తున్న ధనుంజయరావుకు మెమో పంపించారు. అలాగే కలెక్టరు ఇచ్చిన సరెండర్ ఉత్తర్వులను రద్దు చేశారు. డీబీసీకి యథాతథ కల్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీబీసీ రవిచంద్ర బుధవారం తిరిగి విధుల్లోకి చేరడానికి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే ఆయన్ను తిరిగి డ్యూటీలో చేర్చుకునేందుకు అభ్యంతరం తెలుపుతూ ఉపకార వేతనాల కుంభకోంలో ఆయన పాత్రను ప్రస్తావించి ప్రభుత్వానికి తిరిగి నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో వేచిచూడాల్సి ఉంది.